AP Pollution Portal: కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణకు వెబ్‌సైట్ ప్రారంభించిన ఏపీ సర్కార్
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర పర్యవరణ, అటవీ, ఇంధన, సైన్స్&టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా పోర్టల్ ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్‌ను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు.
పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ద...
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర పర్యవరణ, అటవీ, ఇంధన, సైన్స్&టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్ మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ (ఎపిఇఎంసిఎల్) కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (పర్యావరణం) నీరబ్ కుమార్ ప్రసాద్, కార్పొరేషన్ ఎండి ఖజూరియా, చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి అవుతున్న ఫ్లైయాష్ నిర్వహణను ఇకపై ఏపీ ఎన్విరాన్ మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫ్లైయాష్ పై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ పోర్టల్ లో ఫ్లైయాష్ ఉత్పత్తి, కొనుగోలుదారులు, రవాణాదారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని అన్నారు. ఎంత మొత్తంలో ఫైయాష్ ఉత్పత్తి అవుతోంది, దానిని కొనుగోలు చేసే వారు ఎవరు, ఎక్కడకు ఈ ఫ్లైయాష్ రవాణా అవుతోంది, ఎందుకోసం దీనిని వినియోగిస్తున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు ఈ పోర్టల్ ద్వారా నమోదు చేస్తామని తెలిపారు.
అన్ని ఒకే వేదిక పైకి తేవాలనే...
సిమెంట్ కంపెనీలు, టైల్స్, రెడీమిక్స్ కంపెనీలు, జాతీయ రహదారుల నిర్మాణం, ఫైయాష్ తో ఇటుకలు తయారు చేసే పరిశ్రమలు, ఈ ఫ్లైయాష్ ను రవాణా చేసే సంస్థలు అన్నీ ఒకే వేదిక మీదికి వస్తాయని మంత్రి తెలిపారు. అటు పరిశ్రమలకు, ఇటు థర్మల్ ప్లాంట్ లకు ఈ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మేలు జరుగుతుందని, మరోవైపు ఫ్లైయాష్ వినియోగం పూర్తిగా పర్యావరణ నిబంధనల మేరకు జరిగేలా పర్యవేక్షించేందుకు వీలుకలుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు, వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ 2019లో ఎపిఇఎంసిఎల్ ను ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ కార్పొరేషన్ ద్వారా వివిధ పరిశ్రమల ద్వారా విడుదల అవుతున్న వ్యర్థాలను ప్రమాదరహితంగా మార్చడం, వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడం, వ్యర్థాలను డిస్పోజ్ చేయాల్సిన పరిస్థితుల్లో వాటిని ఏ రకంగా చేస్తున్నారనే అంశాలను పర్యవేక్షించడపై దృష్టి సారించడం జరిగిందని అన్నారు.
పారిశ్రామిక, బయో వ్యర్థాల నిర్వహణను నిర్లక్ష్యం చేస్తే ప్రజల ఆరోగ్యాలపై పెను ప్రభావం చూపుతుందని, అలాగే పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుందని అన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు 983 వ్యర్థాలను సృష్టించే సంస్థలు రిజిస్టర్ అయ్యాయని, అలాగే సదరు వ్యర్థాలను రీసైక్లింగ్, రీ ప్రాసెసింగ్ చేసే 171 సంస్థలు, ఈ వ్యర్థాలను రవాణా చేసే 170 సంస్థలు, వాటిని తీసుకువెళ్లే 1279 వాహనాలు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా 8.32 లక్షల మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను తిరిగి వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో సీఎం వైఎస్ జగన్ గారి ఆలోచనా విధానం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తుందని అన్నారు. దేశంలోనే కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో ఏపీ ముందుంజలో నిలుస్తుందని పేర్కొన్నారు.