![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP Ration Rice : రేషన్ బియ్యం వద్దా ? అయితే డబ్బులిస్తారు ! ఏపీలో కొత్త స్కీమ్
రేషన్ బియ్యం వద్దనుకునే కార్డు దారులకు నగదు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి ప్రయోగాత్మకంగా మూడు మున్సిపాల్టీల్లో అమలు చేయనున్నారు.
![AP Ration Rice : రేషన్ బియ్యం వద్దా ? అయితే డబ్బులిస్తారు ! ఏపీలో కొత్త స్కీమ్ AP government has decided to transfer cash to cardholders who do not want ration rice. AP Ration Rice : రేషన్ బియ్యం వద్దా ? అయితే డబ్బులిస్తారు ! ఏపీలో కొత్త స్కీమ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/14/fff2fa875bbeaeaef07b02effac93dfe_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బియ్యానికి కూడా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కొత్త పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. రేషన్ బియ్యం వద్దనుకునేవారికి ఆ బియ్యం ఖరీదు మొత్తాన్ని నగదు రూపంలో అందజేస్తామని ప్రకటించారు. ఈ మేరకు బియ్యం వద్దనుకునే వారి నుంచి డిక్లరేషన్ తీసుకున్న తర్వాత వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ఓ డ్రాఫ్ట్ తయారైందని మంత్రి ప్రకటించారు. సీఎం జగన్ నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్రారంభిస్తామన్నారు. తొలుత మూడు మునిసిపాలిటీల్లో ఈ తరహా విధానాన్ని అమలు చేయబోతున్నామని తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.
కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాద బాధితులకు హోంమంత్రి పరామర్శ, యజమాన్యానిది తప్పని తేలితే కఠిన చర్యలు
ఇప్పటికే రేషన్ బియ్యానికి నగదు బదిలీ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అవసరమైన విధంగా లబ్ధిదారుల నుంచి అనుమతులు తీసుకోవడం, వారితో సంతకాలు పెట్టించుకోవడం వంటి పనులన్నీ ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనరు గిరిజా శంకర్ సర్క్యులర్ జారీచేశారు. వాలంటీర్లు మొబైల్ యాప్‌ను వినియోగించి నగదు బదిలీ వల్ల కలిగే ఉపయోగాలను లబ్ధిదారులకు వినిపించాల్సి ఉంటుంది. అనంతరం లబ్ధిదారుల నుంచి వ్యక్తిగతంగా అంగీకారపత్రంపై సంతకం తీసుకోనున్నారు.
బియ్యం వద్దనుకోవడం వల్ల కార్డులు రద్దవ్వవనే విషయాన్ని ప్రజలకు వాలంటీర్లు వివరించనున్నారు. అవసరమైతే డిబిటి నుంచి వెనక్కు వెళ్లే అవకాశమూ లబ్దిదారులకు ఉంటుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలవుతున్న కార్డుదారులు డిబిటిలోకి రావాలంటే ఆ పథకం నుంచి బయటకు వస్తున్నట్లు అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ వాలంటీర్లు కార్డుదారులను కలిసి వారి నుంచి అంగీకార పత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు- పల్లె వెలుగులో కనీస ఛార్జ్ రూ. 10
తొలిదశలో ప్రయోగాత్మకంగా పట్టణ ప్రాంతాలైన విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో గాజువాక, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, నంద్యాల మున్సిపాలిటీల్లో అమలు చేయనున్నారు.. అయితే కేజీ బియ్యానికి ఎంత నగదు ఇస్తారన్న విషయం మాత్రం ఇంకా బయటకు వెల్లడించలేదు. ఒక వేళ బియ్యానికి బదులు డబ్బులు తీసుకుంటే వారికి బియ్యం అవసరం లేదన్న కారణంగా కార్డులు రద్దు చేస్తారన్న ఓ భయం కూడా లబ్దిదారుల్లో ఏర్పడుతోంది. ఈ విషయంలో కార్డు దారులకు అవగాహన కల్పించాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)