AP Telangana Assets : ఆస్తుల విభజనపై ఏపీ సర్కార్ పిటిషన్- తెలంగాణ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
AP Telangana Assets : ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజన సరిగా జరగలేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
AP Telangana Assets : రాష్ట్ర విభజన అనంతరం ఆస్తుల పంపిణీపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌లో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది ఏపీ ప్రభుత్వం. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఈ విచారణకు కేంద్రం, తెలంగాణ తరఫున న్యాయవాదులు హాజరుకాకపోవడంతో ఇరువురికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాల పాటు వాయిదా వేసింది. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజన సరిగా జరగలేదని, దీంతో ఆర్థికంగా నష్టపోయామని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆస్తుల విభజన న్యాయబద్ధంగా జరపాలని, అందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది.
షెడ్యూల్ 9, 10 సంస్థలు
రాష్ట్ర విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్ లోని సంస్థలను తక్షణమే విభజించాలని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం కోరింది. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో తీవ్రజాప్యం జరిగిందని, ఈ సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లు ఉండని పిటిషన్ లో పేర్కొంది. దాదాపు 91 శాతం సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని వెల్లడించింది. లక్ష మందికిపైగా ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కోర్టుకు తెలిపింది. ఈ సంస్థల విభజన ఆలస్యం కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోందని తెలిపింది. విభజన అంశంలో తెలంగాణ స్పందించడంలేదని, దీంతో ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం అవుతుందని తెలిపింది. ఈ సంస్థల విభజనకు తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది.
ఆస్తులు, అప్పుల విభజనపై పిటిషన్
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులను వేగంగా విభజించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లలో పొందు పరిచిన హక్కులతో పాటు విభజన అనంతరం తమకు దక్కాల్సిన ప్రయోజనాలను రక్షించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సమానంగా, న్యాయమైన పద్ధతిలో వేగంగా ఆస్తులు, అప్పులను విభజించాలని పిటిషన్ లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విభజన హక్కు చట్టం - 2014 ప్రకారం రాష్ట్రం విడిపోయి ఎనిమిది ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆస్తుల విభజన ప్రారంభం కాలేదని తెలిపింది. సమస్యను వేగంగా పరిష్కరించాలని పదే పదే కోరుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపింది. షెడ్యూల్-9లో పేర్కొన్న 91 సంస్థలు, షెడ్యూల్-10లో చెప్పిన 142 సంస్థలతో పాటు చట్టంలో లేని 12 సంస్థల్లో ఏ ఒక్కదాన్నీ రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయలేదని, ఈ కారణంగా తెలంగాణకే ప్రయోజనం కలుగుతుందని రిట్ పిటషన్ లో వివరించింది. అయితే వీటి విలువ రూ.1,42,601 కోట్ల మేరకు ఉంటుందని స్పష్టం చేసింది.
అత్యధికం హైదరాబాద్ లోనే
ఆస్తుల్లో అత్యధికంగా ఒకప్పటి సమైక్య రాష్ట్ర రాజధాని, ప్రస్తుత తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లోనే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. రాజధాని కచ్చితంగా అభివృద్ధి చేయాలన్న కారణంగా.. హైదరాబాద్ తో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాలు చాలా వరకు అభివృద్ధి చెందాయని, ఉమ్మడి రాష్ట్రంలోని నిధులతో ప్రజా సంక్షేమ, మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు పూర్తిగా అక్కడి నుంచే అమలు అయ్యాయని తెలిపింది. ఫలితంగా అది ఆర్థిక పవర్ హౌజ్ గా మారిందని చెప్పింది. షెడ్యూల్-9లో పేర్కొన్న సంస్థల ప్రధాన కార్యాలయాల విలువ దాదాపు రూ.24,018.53 కోట్లు ఉంటుందని, వీటిలో రూ.22,556.45 కోట్ల విలువైనవి తెలంగాణలోనే ఉన్నాయని ఏపీ అంటోంది. షెడ్యూల్-10లో పేర్కొన్న ఆస్తుల విలువ రూ.34,642.77 కోట్లు కాగా... అందులో రూ.30,530.86 కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.