(Source: ECI/ABP News/ABP Majha)
AP Govt : ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఈ నెల 31లోపు పెండింగ్ బిల్లులు క్లియర్!
AP Govt : ఉద్యోగ సంఘాలతో మంత్రుల ఉపసంఘం సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశాల్లో కూడా అసలు విషయాలు చర్చించకపోవటం విశేషం.
AP Govt :ఉద్యోగుల సమస్యలకు సంబంధించి చర్చ జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని అన్నారు. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే ఉన్నామని చెప్పారు.కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని,ఆ ప్రభావం ఏపీ మీద పడిందని చెప్పారు.ఆ క్రమంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమని చెప్పారు. వీలైనంత వరకు సమస్య పరిష్కారానికి మేం ప్రయత్నిస్తూనే ఉన్నామని అన్నారు. ఇవాళ చర్చలకు పెద్ద ప్రాధాన్యత లేదని, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగుల పక్షమని వివరించారు. ఉద్యోగుల సమస్యల్లో ఆర్థిక పరమైన అంశాలపై చర్చించినట్లు సజ్జల తెలిపారు.
పెండింగ్ క్లైమ్స్ క్లియర్ చేస్తాం- మంత్రి ఆదిమూలపు
ఉద్యోగుల పెండింగ్ క్లైమ్స్ అన్ని క్లియర్ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. జీపీఎఫ్ ఇతర పెండింగ్ బిల్లులు అన్ని ఈ నెలాఖరులోగా పరిష్కారం అవుతాయన్నారు. పెండింగ్ బిల్లులు..అదనంగా టీఏ ఇతర బిల్లులు కూడా చెల్లిస్తామని, జీవోఎం దృష్టికి తీసుకువచ్చిన అంశాలు కూడా పరిష్కారం అవుతాయని తెలిపారు.
ఉద్యయం యథావిధిగా కొనసాగుతుంది- బొప్పరాజు
మార్చి 9న జరిగే ఉద్యమం యథావిధిగా కొనసాగుతుందని, మంగళవారం చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశమయ్యారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ తదితర సంఘాల నేతలు హాజరయ్యారు. ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు అహ్వానించలేదు. మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని డిమండ్ చేశారు. పీఆర్సీ బకాయిలతో పాటు ఇతర అన్ని ఆర్థిక పరమైన వివరాలు చెప్పాలని కోరారు. మార్చి 9న జరిగే ఉద్యమం యధావిధిగా కొనసాగుతుందని నేతలు తేల్చి చెప్పారు. చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
ఛాయ్ బిస్కెట్ మీటింగ్ కాదు -బండి శ్రీనివాసరావు
ఇవాళ జరిగింది చాయ్ బిస్కట్ మీటింగ్ కాదని, ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 31 లోపు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారని, జీపీఎఫ్ కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 16 వేల కోట్ల బిల్లు పెండింగ్ లో ఉన్నాయని, మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి బయోమెట్రిక్ తీసేయ్యాలని చెప్పామన్నారు. 60 నుంచి 62 ఏళ్లలో ఉన్న గురుకులాలు నాన్ టీచింగ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు 62 వరకు పెంచుతామని హామీ ఇచ్చారని, ఈ నెల 16న ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి సీఎస్ దగ్గర సమావేశం ఉందనిచెప్పారు.