2024 లో టీడీపీకి 4 సీట్లు - దేవుడి స్క్రిప్ట్ ఇదే! - కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్టీఆర్ మహానుభావుడు... పేదల, బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడ్డారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ + వైఎస్సార్ ను కలిపితే ఏపీ సీఎం జగన్ అన్నారు.
ఎన్టీఆర్ + వైఎస్సార్ ను కలిపితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ మహానుభావుడు... పేదల, బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడ్డారని నాని అన్నారు.
ఎన్టీఆర్ పేరు స్మరిస్తాం....
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత సీఎం నందమూరి తారక రామారావు పేరును స్మరిస్తూనే ఉంటుందని, మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఎన్టీఆర్ ను ఎందుకు వెన్నుపోటు పొడవాల్సి ఉంటుంది అనేదే సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను ఎందుకు కాళ్లు పట్టుకు లాగేశారు అనేది మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఎందుకు ఎన్టీఆర్ పై చెప్పులత దాడి చేయించారో చెప్పాలన్నారు. ఎన్టీఆర్ ను ఎందుకు సస్పెండ్ చేసి పార్టీ నుంచి గెంటేశారో కూడా చెప్పాలని ఆయన అడిగారు. చంద్రబాబును చూస్తే వెన్నుపోటు గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ కు అభివృద్ధి పైనే దృష్టి ఉంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తాం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఇవ్వండి అని అడిగిన కూడా.. సీట్ కష్టం అని నిజాయితీ గా జగన్ చెప్పారని గుర్తు చేశారు. జగన్ అవకాశవాద రాజకీయాలు చెయ్యడని, 2019 లో దేవుడు రాసిన స్క్రిప్ట్ 23 మందిని కొంటే.. 23 టీడీపీకి ఇచ్చాడని, 2024 లో కూడా ఇప్పుడు నలుగురిని కొన్న చంద్రబాబుకు నాలుగే వస్తాయని, ఇది కూడా దేవుడి స్క్రిప్ట్ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. జగన్ కి ఇద్దరు ఎమ్మెల్యేలు ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపాటు...
రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలనే కుట్ర జరుగుతుందని రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. మాల, మాదిగల మధ్య కూడా చిచ్చు పెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. దళితులను వైయస్సార్‌సీపీకి దూరం చేయాలన్న లక్ష్యంతో జరుగుతున్న ప్రచారాలను తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు హయాంలోనే దళితులకు అన్యాయం జరిగిందని అన్నారు. చంద్రబాబు సీఎంగా పని చేసిన సమయంలో యథేచ్ఛగా దాడులు, అవమాన కార్యక్రమాల జరగలేదా అని ప్రశ్నించారు. ఆ కాలంలోనే ఎస్సీ, ఎస్టీ కేసులు అత్యధికంగా నమోదయ్యాయని, ఎన్‌సీబీ రికార్డుల్లోనే స్పష్టంగా ఆ వివరాలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు మంచి వ్యక్తి కాదని ప్రజలందరికీ తెలుసని, జగన్ మీద కూడా అదే ముద్ర వేయాలన్న కుట్ర జరుగుతుందని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు వైఖరి, పద్ధతి మార్చుకోవాలని మంత్రి సూచించారు. లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
అచ్చెన్న హత్య ఘటన పై రాజకీయమా....
వ్యక్తుల మధ్య జరిగిన గొడవపై సైతం చంద్రబాబు రాజకీయం చేయటం దారుణమని బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ అన్నారు. బాబుకు వత్తాసుగా మరి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అచ్చెన్న హత్య ఘటనలో చంద్రబాబు వైఖరిపై ఎంపీ సురేష్ ఫైర్ అయ్యారు. అచ్చెన్న హత్యకు వ్యక్తిగత గొడవలే కారణమని, డ్యూటీ విషయంలో విభేదాలు ఘర్షణతో ఆయన హత్య జరగటంతో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని అన్నారు. అయితే ఈ ఘటన పై చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారని అన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. జగన్ ప్రభుత్వ హయాంలో దళితులకు పూర్తి న్యాయం జరుగుతుందని, అన్ని రంగాల్లో గుర్తింపు, తగిన ప్రాధాన్యత లభిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయాల్లో ఎక్కడా రాజీ పడని వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని నందిగం సురేష్ అన్నారు.