ప్రకాశంలో టీడీపీ అభ్యర్థులు దాదాపు ఖరారు, ఎనిమిది చోట్ల టీడీపీ పోటీ ?
Tdp candidates almost finalized in Prakasam : ప్రకాశం జిల్లాలో పోటీ చేయబోయే స్థానాలపై జనసేన, టీడీపీ అగ్ర నాయకులు ఒక స్పష్టతకు వచ్చారు. ఎనిమిది స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది.
Tdp Candidates in Prakasam District: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో సీట్ల పంపకాలు, అభ్యర్థులు ఖరారుపై టీడీపీ అధిష్టానం జోరు పెంచింది. జిల్లాలు వారీగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు ప్రకాశం జిల్లాలో పోటీ చేయబోయే స్థానాలపై జనసేన, టీడీపీ (TDP) అగ్ర నాయకులు ఒక స్పష్టతకు వచ్చారు. ఈ మేరకు జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఒక స్థానం జనసేన (Janasena Party)కు, మరో ఎనిమిది స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నాయి. ఆయా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గతంలో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులకు అవకాశం కల్పిస్తున్నట్టు చెబుతుండగా.. జనసేన నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులపై స్పష్టత రావాల్సి ఉంది. జనసేనకు దర్శి అసెంబ్లీ స్థానం కేటాయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేసేందుకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో ఎవరికి టికెట్ కేటాయించాలన్న దానిపై జనసేన అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది.
టీడీపీ అభ్యర్థులు వీళ్లే
ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను దాదాపు టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీలోని ముఖ్య నాయకులు పోటీ చేయబోయే అభ్యర్థులకు సమాచారాన్ని అందించినట్టు ప్రచారం జరుగుతోంది. ఒంగులు నుంచి దామచర్ల జనార్ధన్, కనిగిరి ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, అద్దంకి గొట్టిపాటి రవి కుమార్, మార్కాపురం కందుల నారాయణరెడ్డి, పర్చూరు ఏలూరి సాంబశివరావు, గిద్దలూరు ముత్తుమల అశోక్‌రెడ్డి, కొండపి(ఎస్సీ) డోలా బాల వీరాంజనేయస్వామి, యర్రగొండపాలెం(ఎస్సీ) గూడూరి ఎరిక్సన్ బాబు పోటీ చేయబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వీరంతా పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్టేనని పార్టీ వర్గాలు నుంచి సమాచారం. బీజేపీతో పొత్తు, ఇతర అంశాలు ఏమైనా ప్రభావితం చేస్తే ఒకటి, రెండు స్థానాల్లో మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా స్థానాలను తెలుగుదేశం పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
వైసీపీకి బలమైన జిల్లా
వైసీపీకి గడిచిన ఎన్నికల్లో ఇక్కడ అత్యధిక స్థానాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ ఆధిపత్యం చెలాయించాలని అగ్ర నాయకత్వం భావిస్తోంది. కానీ, పార్టీలో ఇంటి పోరు, కీలక నేతలు అలక, నేతల మధ్య విభేదాలు వంటి అంశాలు ఇక్కడ పార్టీకి ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. వీటిన్నింటినీ చక్కబెట్టుకుని ఎన్నికల సమయానికి వైసీపీ సిద్ధం కావాల్సి ఉంది. గడిచిన ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ స్థానాలను నిలబెట్టుకోవడం వైసీపీకి సవాల్‌గానే చెబుతున్నారు.