Pawan Comments: పొత్తుల అంశంపై తుది దశకు చర్చలు, త్వరలోనే వివరాలు వెల్లడి- జనసేన కీలక ప్రకటన
Janasena News: ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఖాయమైందనే ప్రచారం జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
Janasena Chief Pawan Kalyan: పొత్తులపై జనసేన కీలక ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు ఉంటాయని స్పష్టం చేసింది. పొత్తులపై స్పష్టత ఇస్తూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పేరుతో జనసేన అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దని, జనసైనికులందరూ సంమయనం పాటించాలని సూచించింది. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, పార్టీ నేతలు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలిపింది. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరూ ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరని, ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని జనసేన (Janasena Party) తెలిపింది. ఈ సమయంలో పార్టీ శ్రేణులందరూ అప్రమత్తంగా ఉండటం అవశ్యం అని సూచనలు చేసింది. జనహితానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్దికి జనసేన పార్టీ ప్రధమ ప్రాధాన్యం ఇస్తుందని, విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సమగ్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకెళ్తున్నామని జనసేన పేర్కొంది.
సందేహాలుంటే హరిప్రసాద్ దృష్టికి..
పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయవద్దని, ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారు అవుతారని జనసేన హెచ్చరించింది. పొత్తులకు సంబంధించి అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావొచ్చని, తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరుతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చానన్నారు. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖాయమైందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
సీట్ల సర్దుబాటుపై అవగాహనా..
ఏపీలో ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో పొత్తులు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో ముందుకెళ్తున్నాయి. ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనికి కూడా వచ్చాయి. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు, పవన్ సమావేశమై ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై క్లారిటీకి వచ్చారు. జనసేన 30 స్థానాల్లోపు అసెంబ్లీ సీట్లు, మూడు ఎంపీ సీట్లను తీసుకోనుందని వార్తలొచ్చాయి. త్వరలోనే టీడీపీ, జనసేన కలిసి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాయనే ప్రచారం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా బీజేపీ కూడా పొత్తులోకి వచ్చేందుకు రెడీ అయింది.
టీడీపీ అధినేత చంద్రబాబును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీకి పిలిచి పొత్తులపై మాట్లాడారు. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు కూడా సిద్దంగా ఉన్నారు. దీంతో బీజేపీతో పొత్తుతో పాటు సీట్లు సర్దుబాటుపై కూడా అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చించినట్లు వార్తలొచ్చాయి. బీజేపీ 8 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు వార్తలు బయటకొచ్చాయి. త్వరలోనే బీజేపీతో పొత్తుపై అధికారిక ప్రకటన వస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశముంది. అమిత్ షా, నడ్డాతో పవన్ భేటీ కానున్నారు. ఈ క్రమంలో పొత్తులపై చర్చలు జరుగుతున్నట్లు పవన్ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.