High Tension in AP: ఏపీలో గొడవల మధ్యే పోలింగ్, జనసేన నేత కారుకు నిప్పు, మరోచోట ఈవీఎంలు బద్దలు!
High Tension at AP Polling Centers: ఏపీలోని చాలా జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులు చాలా ఘర్షణపూరితంగానే ఉన్నాయి. వివిధ పార్టీల కార్యకర్తల మధ్య విపరీతమైన ఘర్షణలు జరుగుతున్నాయి.
High Tension in AP: ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ, జనసేన - వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా జనసేన నేత కారుకు నిప్పు పెట్టడం కలకలం రేపుతోంది. ముప్పాళ్ల మండలం నార్నెపాడులో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రెంటాలలో కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డి కారు ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఎన్టీఆర్ జిల్లా నవాబు పేటలో ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. దీంతో ఓటర్లు భయంతో పరుగులు తీశారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
పెద్దారెడ్డి కారు అద్దాలు ధ్వంసం
తాడిపత్రిలోనూ కూటమి నేతలు, అధికార పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. కమాన్ సర్కిల్ లో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొని.. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఈవీఎంలు పగలగొట్టిన స్థానికులు
అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట దళావాయిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, జనసేన ఏజెంట్ల మధ్య ఘర్షణ చెలరేగడంతో నిరసనగా ఈవీఎంలను స్థానికులు పగలగొట్టారు. దీంతో 192వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిలిచిపోగా.. కొత్త ఈవీఎంలను అధికారులు తెప్పించారు. జనసేన ఏజెంట్ ను వైసీపీ వర్గీయులు లాగిపడేయడానికి నిరసనగా.. నిరసనగా గ్రామస్తులు ఈవీఎంలను పగలగొట్టారు. దీంతో 192 పోలింగ్ బూత్ పోలింగ్ ఆగిపోయింది.
పోలింగ్ ప్రక్రియ పునరుద్ధరించడానికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్త ఈవీఎంలను పోలింగ్ కేంద్రానికి అధికారులు తరలించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్దకు జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు చేరుకున్నారు. పీఓతో కూటమి నేతల వాగ్వాదానికి దిగారు. జనసేన ఏజెంట్ లు లేకుండా పోలింగ్ ఎలా నిర్వహిస్తారని పీఓతో కూటమి నేతలు వాగ్వాదానికి దిగారు. పోలింగ్ బూత్ ను సందర్శించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ ఆదేశాలిచ్చారు.