AP Schools: ఏ ఒక్క పాఠశాల మూతపడదు... ప్రభుత్వానికి స్కూల్స్ అందించేందుకు యాజమాన్యాలు ఆమోదం... మంత్రి ఆదిమూలపు సురేశ్ కామెంట్స్
రాష్ట్రంలో 93 శాతం ఎయిడెడ్ యాజమాన్యాలు పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించేందుకు ఆమోదం తెలిపాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఏ ఒక్క అన్ ఎయిడెడ్ పాఠశాలను మూసివేయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ 2,200 పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం గ్రాంట్ ఇస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రభుత్వ గ్రాంట్‌తో నడుస్తున్నా ఆశించిన ఫలితాలు రావటం లేదన్నారు. పాఠశాలలు, కళాశాలలకు ఏటా రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రకటించారు. నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి అన్నారు. సంస్కరణలకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోకతప్పదన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్య ఉండాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో సంస్కరణల కోసం కమిటీ వేశామన్నారు. ప్రభుత్వ పథకాలు, అమ్మఒడి అందిస్తున్నందున అధ్యయనం కోసం కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ ప్రభుత్వానికి తన నివేదిక ఇచ్చిందన్నారు. కాలేజీలు స్వచ్ఛందంగా ఆస్తులు వదులుకోవడానికి ముందుకు వస్తే ఏం చెయ్యాలో ప్రభుత్వానికి కమిటీ సూచనలు చేసిందన్నారు. యాజమాన్యాలు స్వచ్ఛందంగా విద్యాసంస్థలను అప్పగిస్తే ప్రభుత్వమే నడిపేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
93శాతం యాజమాన్యాలు ఆమోదం
యాజమాన్యాలు గ్రాంట్స్ వదులుకునేందుకు ముందుకు వస్తే అంగీకరిస్తామని మంత్రి సురేశ్ తెలిపారు. 93 శాతం ఎయిడెడ్ యాజమాన్యాలు పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించేందుకు ఆమోదం తెలిపాయన్నారు. 5 నుంచి 7 యాజమాన్యాలు ఆస్తులు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చాయని తెలిపారు. 89 శాతం జూనియర్ కాలేజీలు లెక్చరర్లను కూడా సరెండేర్ చేశారని పేర్కొన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రభుత్వానికి రిపోర్ట్ చేయగా 2 వేల ఎయిడెడ్ పాఠశాలల్లో 1200 పైగా పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించారని మంత్రి సోమవారం తెలిపారు. ఏ ఒక్క స్కూల్ కూడా మూతపడదని ఆయన స్పష్టం చేశారు.
కాంట్రాక్టు లెక్చరర్లను తొలగించం
ఎవరైనా నడపలేకపోతే ప్రభుత్వ పాఠశాలలుగా మార్చి నడుపుతామని మంత్రి తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం, వర్కింగ్ కమిటీని వేశామన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రతకు చర్యలు చేపడతామని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. కాంట్రాక్టు లెక్చరర్లు ఎవ్వరూ ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో వ్యాపారాన్ని ప్రోత్సహించిందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం విద్యను బలోపేతం చేస్తుందని సురేశ్ తెలిపారు.
Also Read: గులాబ్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు... మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ప్రకటించిన సీఎం జగన్