Chinta Mohan: చిరంజీవి కాంగ్రెస్‌లోకి వస్తే సీఎం చేస్తాం, ఇదే లాస్ట్ ఛాన్స్ - కేంద్ర మాజీ మంత్రి సంచలనం
AP Congress: కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిని రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. చిరంజీవి మళ్లీ కాంగ్రెస్‌లోకి రావాలని కోరారు.
YS Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జయలలిత లాగా ఏపీలో వైఎస్ షర్మిల సీఎం కావాలని రాష్ట్ర మహిళలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏపీకి మహిళా ముఖ్యమంత్రి ఉండకూడదా? అని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తమ పార్టీకి 130 సీట్లు వస్తాయని చింతా మోహన్ జోస్యం చెప్పారు. టీడీపీ రెండో స్థానంలో ఉంటుందని, వైసీపీకి 10 సీట్లు వస్తాయని అన్నారు. షర్మిల ఏపీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని వ్యాఖ్యానించారు. షర్మిల రాకముందు పత్రికల్లో కాంగ్రెస్ పేరు లేదా తమ పేరు రాసేవారు కాదని, ఇప్పుడు అడగకపోయినా షర్మిల పేరు, కాంగ్రెస్ పేరు రాస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాల్సిందిగా చింతా మోహన్ కోరారు. తిరుపతి నుంచి చిరంజీవి పోటీ చేస్తే 50 వేల మెజార్టీతో గెలిపించడమే కాక అందరి కాళ్లు పట్టుకుని సీఎంను కూడా చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అయ్యేందుకు చిరంజీవికి ఇదే చివరి అవకాశమని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. చిరంజీవిని సీఎంగా చూడాలని చాలామంది కోరుకుంటున్నారని అన్నారు. చిరంజీవి ఇప్పుడు రాకపోతే మరో పదేళ్ల పాటు కాపులు, బలిజలకు సీఎంగా అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్ని వర్గాలు కోరుకుంటున్నాయని, జగన్ పాలనలో రాష్ట్రం అధ్వాన్నంగా తయారైందని ఆరోపించారు. జగన్ పాలనలో పాకిస్తాన్ కంటే ఘోరంగా ఏపీ రాజకీయాలు ఉన్నాయని చింతా మోహన్ ఘాటుగా విమర్శించారు.
అర్థరాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడంపై చింతా మోహన్ స్పందించారు. అమిత్ షాను అర్థరాత్రి చంద్రబాబు కలవాల్సిన పని ఏముందని ప్రశ్నించారు. తెలుగుదేశం పుట్టింది ఇందుకేనా అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రవర్తన వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభతో ఘోషిస్తుందని అన్నారు. షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్‌కు లాభం జరుగుతుందని, పార్టీ మైలేజ్ పెరుగుతుందని తెలిపారు. తిరుపతిగా రాజధానిగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, తిరుపతిని రాజధానిగా చేస్తే రాయలసీమలో కరువు పోయి అభివృద్ది జరుగుతుందన్నారు. తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు.
తిరుపతిని రాజధాని చేయాలని మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చెప్పినా.. సంజీవయ్య కర్నూరుకు తరలించారని అన్నారు. ఆ తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మారిందని గుర్తు చేశారు. మూడు రాజధానులు అని చెప్పిన వైసీపీ.. ఇప్పుడు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. భూముల కోసం వైసీపీ విశాఖపట్నం వెళ్లిందని, తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు హైదరాబాద్‌ను విడిచి తూళ్లూరుకు వచ్చారని అన్నారు. తిరుపతి రాజధాని అవుతుందని అందరూ ఎదురుచూస్తున్నారని, ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, భూముల, వనరులు ఉన్నాయన్నారు. తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నట్లు చింతా మోహన్ చెప్పుకొచ్చారు.