YS Jagan Tadipatri Tour: సీఎం జగన్ పర్యటన, తాడిపత్రిలో చెట్లు నరికివేత - సిగ్గుండాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
Tadipatri News: ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడో విడత ఎన్నికల ప్రచారం తాడిపత్రి నుంచి మొదలవుతుంది. అయితే జగన్ తాడిపత్రి పర్యటన వివాదాస్పదం అవుతోంది. జగన్ వస్తున్నారని అధికారులు చెట్లు కొట్టేస్తున్నారు.
JC Prabhakar Reddy News: తాడిపత్రి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడిపత్రి పర్యటన వివాదాస్పదం అవుతోంది. ఏప్రిల్ 28న సీఎం జగన్ రాక సందర్భంగా తాడిపత్రి పట్టణంలోని పచ్చని చెట్లను నరికి వేస్తున్నారు. దీనిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం చేశారు. తాడపత్రి ఎమ్మెల్యే చెట్లను నరికివేసి సునకానందం పొందుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.
చెట్లు నరికి వేయించడం ఎంతవరకు సబబు
తాడిపత్రి పట్టణం పచ్చని చెట్లు, పరిశుభ్రతలో దేశవ్యాప్తంగా పేరుగాంచింది అన్నారు. అలాంటి తాడిపత్రిలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా అధికారులు దగ్గరుండి మరి చెట్లు నరికి వేయించడం ఎంతవరకు సబబు అంటూ మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు నరికే సంస్కృతి ఉన్న వారికి అభివృద్ధి చేసే లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయంటూ సీఎం జగన్, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చెట్లు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు
సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లలో భాగంగా తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డు లో ఉన్న ఎన్నో సంవత్సరాల వయసు చెట్లను మున్సిపల్ అధికారులు దగ్గరుండి మరీ తొలగించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కూడా ప్రభుత్వ అధికారులు తమ స్వామి భక్తుని చాటుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై వెంటనే కఠినమైన కేసులు పెట్టి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పార్టీ పచ్చదనానికి పరిశుభ్రతకు మారుపేరని చెప్తాడు కానీ ఆయన ఎక్కడికి వెళ్లినా కూడా చెట్లు నరికే కార్యక్రమాన్ని వదలకుండా చేస్తాడని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది. రెండు దశలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్.. ఆదివారం (ఏప్రిల్ 28) నుంచి మూడో దశ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ప్రతిరోజూ మూడు సభలో పాల్గొనేలా వైసీపీ ప్లాన్ చేసింది. ఆదివారం నుంచి మే 1 వరకు ప్రతిరోజూ మూడు సభలలో జగన్ పాల్గొననున్నారు. ఏప్రిల్ 28న తొలిరోజు ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, తరువాత కందుకూరులో నిర్వహించనున్న వైసీపీ సభలలో సీఎం జగన్ పాల్గొంటారని షెడ్యూల్ విడుదల చేశారు.