Sikh Corporation: సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
సిక్కుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లో మరో కార్పొరేషన్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. సిక్కుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
సిక్కు పెద్దలతో సీఎంజగన్ సమావేశం..
రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ సభ్యుడు జితేందర్‌జిత్ సింగ్ నేతృత్వంలో ముఖ్యంత్రిని సిక్కు మత పెద్దలు కలసి తమ సమస్యలను గురించి వివరించారు.
ఒక శతాబ్దం కిందటి నుంచి సిక్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారని, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని ఈ సందర్బంగా సిక్కు పెద్దలు సీఎంకు వివరించారు. సిక్కులు, వారికి అనుబంధంగా ఉంటున్న వారి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సిక్కు పెద్దలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సూచించారు.
ప్రత్యేక కార్పొరేషన్ కు సీఎం ఓకే...
సిక్కు మత పెద్దలు కోరిక మేరకు సిక్కుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం జగన్ ఓకే చెప్పారు. దీంతో సిక్కులు అంతా కలసి సీఎం కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సిక్కు సాంప్రదాయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సత్కిరించారు. గురు ద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి, అంగీకారం తెలిపారు.
గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని సీఎం అదికారులకు ఆదేశాలు ఇచ్చారు. గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు... పూజారులు, పాస్టర్లు, మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవుదినంగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.
విద్యా సంస్థ ఏర్పాటుకు సీఎం అంగీకారం..
మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని సీఎం వెల్లడించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, వివిధ సామాజిక వర్గాలు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉంటాయని సీఎం వివరించారు. 10 రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.
పది ఫలితాల్లో రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ..
10వ తరగతి పరీక్షల ఫలితాలలో బీసీ సంక్షేమ శాఖకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్ధులు ఉత్తమ ఫలితాలను సాధించి సత్తాను చాటారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. మెరుగైన ఉత్తీర్ణతా శాతంతో పాటు గుణాత్మకమైన ఫలితాలను కూడా సాధించి ప్రతిభా పాటవాలలో తాము ఎవరికీ తీసిపోమని నిరూపించారని అన్నారు. బిసి రెసిడెన్షియల్ పాఠశాలల నుండి 5,114 మంది విద్యార్ధులు 10వ తరగతి పరీక్షలు రాయగా, అందులో 4,579 మంది ఉత్తీర్ణులై 90శాతం ఉత్తీర్ణతను సాధించారని అన్నారు. ఇది గత సంవత్సరం సాధించిన 82 శాతంతో పోలిస్తే, గణనీయమైన వృద్ధి అని చెప్పవచ్చని మంత్రి తెలిపారు. ఉత్తీర్ణులైన వారిలో 3,858 మంది అంటే 76 శాతం ప్రథమ శ్రేణిలో ఫలితాలను సాధించారని అన్నారు. 11 రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు నూరు శాతం ఫలితాలను సాధించారని, విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్ది 588/600 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో బిసి రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్ధులలో ప్రధమ స్ధానం పొందినట్లు చెప్పారు.