Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
Cyclone Michaung: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్లు జిల్లా యంత్రాంగం మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Cyclone Michaung: మిగ్‌జాం తుపాను ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది. ఇన్నిరోజులు వర్షాభావ పరిస్థితులతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు సైక్లోన్ ధాటికి బయపడిపోతున్నారు. వారిలో భయాన్ని పొగొట్టి అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తుపాను రాక అనంతర పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్లు జిల్లా యంత్రాంగం మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని శిబిరాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి లోటు రానీయొద్దని తెలిపారు. ఆహారం, మందులు, నిత్యవసరాలు అందుబాటులో ఉంచాలన్నారు.
తుపాను వల్ల దెబ్బతినబోయే రవాణా, కమ్యూనికేషన్, పవర్ సప్లై పనులు వేగవంతం చేసేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు జగన్. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అందజేస్తూ అందరూ సహకారంతో ప్రాణనష్టం లేకుండా విపత్తను ఎదుర్కోవాలని సూచించారు.
అసలే వరి కోతల కాలం కావడంతో పంటకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. పొలాల్లో, కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ బాధ్యతను మిల్లర్లు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు తుపాను సహాయక చర్యలు మరింత పెంచాలని సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రైతులకు కలిగే నష్టాన్ని నివారించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు. తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని....పక్కా ప్రణాళిక ద్వారా నష్టం జరగకుండా చూడాలన్నారు.
గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా...ప్రభుత్వం తగు రీతిలో స్పందించ లేదని ఆరోపించారు చంద్రబాబు. ధాన్యం కోనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని...సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని అన్నారు. తుపాను బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని సూచించారు చంద్రబాబు. తుపాను బాధితులకు అండగా నిలవాలని పిలుపు నిచ్చారు. పలు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది...బాధిత వర్గాలకు అండగా ఉండాలని, చేతనైన సాయం చేయాలని నాయుడు కోరారు.