YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
CM YS Jagan: వరుసగా ఐదో ఏడాది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వాహన మిత్ర నిధులను విడుదల చేశారు. ఈక్రమంలోనే ఆటో డ్రైవర్లు అందించిన ఖాకీ చొక్కాను ధరించారు.
YSR Vahana Mitra 2023: వరుసగా ఐదో ఏడాది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వాహన మిత్ర నిధులను విడుదల చేశారు. విజయవాడలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈక్రమంలోనే ఆటో డ్రైవర్లు అందజేసిన ఖాకీ చొక్కాను ధరించారు. బతుకు బండిని లాగడానికి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసమే ఈ పథకం ప్రారంభించినట్లు చెప్పారు. వాహనం ఇన్సూరెన్స్, ఇతర ఖర్చుల కోసమే వైఎస్సార్ వాహన మిత్ర అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఇచ్చిన డబ్బులను దేనికోసమైనా వాడుకోవచ్చని చెప్పారు. కానీ వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికేట్, ఇన్సారెన్స్ రెన్యూవల్ మాత్రం చేయించుకొని దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. ఈరోజు మొత్తం రూ. 276 కోట్ల రూపాయలు జమ చేశామని దీని ద్వారా ఒక్కొక్కరికీ రూ.50 వేలు లబ్ధి జరుగుతోందన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నామని వెల్లడించారు. ఇది జగనన్న ప్రభుత్వం కాదని.. ఇది మీ అందరి ప్రభుత్వం అని వివరించారు. ఎంతో మంది ప్రయాణికులకు సేవలు అందించే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వైసీపీ సర్కారు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
విజయవాడ విద్యాధరపురంలో వరుసగా ఐదో ఏడాది వైయస్ఆర్ వాహనమిత్ర నిధులు విడుదల చేసేందుకు వచ్చిన సీఎం వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికిన మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు. #YSRVahanaMitra#CMYSJagan#AndhraPradesh pic.twitter.com/NsuUH5ihSr
— YSR Congress Party (@YSRCParty) September 29, 2023
అలాగే పథకాలు అన్నీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అవినీతికి తావు లేకుండా వాలంటీర్ వ్యవస్థతో పాలనను ప్రజలకు చేరువ చేశామన్నారు. ఆర్బీకేలతో రైతులకు అండగా నిలిచామని.. పాదయాత్రలో మీ అందరి కష్టాలు చూశానంటూ చెప్పుకొచ్చారు. మీ సమస్యలకు పరిష్కారంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతన్నకు రూ.30,985 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా సాయం అందిస్తామన్నారు. మత్స్యకార కుటుబాలకు కూడా అండగా నిలిచామన్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటే పేదల గొంతుకై నిలబడిన ప్రభుత్వం తమదంటూ వివరించారు. చిరు వ్యాపారులకు రూ.2,965 కోట్లు సాయం అందించామన్నారు. అలాగే వైఎస్సార్ కాపు నేస్తంతో రూ.2,029కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తంతో రూ.1257 సాయం అందించామని గర్వంగా తెలిపారు.
త్వరలోనే కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ఏపీ సీఎం జగన్ వివరించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని అన్నారు. అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, నీరు - చెట్టు పేరుుతో దోపిడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని పేర్కొన్నారు. వాళ్లకు అధికారం ఉంటే చాలని.. కానీ తనకు మాత్రం పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలంతా తనకు అండగా నిలబడి గెలిపించుకుంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. ఓటు వేసే ముందు రాష్ట్రంలో జరుగుతున్న మంచి గురించి ఆలోచించి ఓటేయమని సూచించారు.
సీఎం వైయస్ జగన్ హయాంలోనే విజయవాడ నగరం అభివృద్ధి జరిగింది. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో వేలాది కుటుంబాలు నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, పార్కులు ఇలా నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
— YSR Congress Party (@YSRCParty) September 29, 2023
- మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… pic.twitter.com/43BwhJPfdU
మరోవైపు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం జగన్ హయాంలోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందిందని చెప్పాు. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల వేలాది కుటుంబాలు నిశ్చితంగా ఉంటున్నాయని వివరించారు. అలాగే అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, పార్కులు నిర్మించడం వంటి ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.