CM Jagan Reveiw : మే నెలాఖరుకి ఉద్యోగాల భర్తీ పూర్తి చేయండి : సీఎం జగన్
CM Jagan Reveiw : మే నెలాఖరు నాటికి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల మాదిరి ఆరోగ్య మిత్రలకు నగదు ప్రోత్సాహకాలు అందించాలన్నారు.
CM Jagan Reveiw : వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్‌ను సీఎం జగన్ పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఎలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం లాంటి రంగాల్లోని వ్యవస్థలను ప్రక్షాలన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. వాటి ద్వారా ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకమైనవని సీఎం అన్నారు. వైద్య రంగంలో చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వేల సంఖ్యలో పోస్టులను భర్తీచేశామన్నారు.
వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆసుపత్రులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్ మోడల్‌ను పరిశీలించిన సీఎం శ్రీ వైయస్.జగన్. #CMYSJagan pic.twitter.com/oitmo9k5h9
— YSR Congress Party (@YSRCParty) April 12, 2022
ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు
విలేజ్, వార్డు క్లినిక్స్ దగ్గర నుంచి బోధన ఆస్పత్రుల వరకూ నాడు–నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నామని సీఎం జగన్ అన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామన్నారు. ఆరోగ్య ఆసరా కింద రోగులకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటి వెళ్లే సమయంలో డబ్బులు ఇస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. 16 టీచింగ్ ఆస్పత్రులను తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నామని తెలిపారు. భారీ మార్పులను ఆశించి, దానికి అనుగుణంగా లక్ష్యాలు పెట్టుకున్నామన్నారు.
రాష్ట్రంలో 5 పాజిటివ్ కేసులు మాత్రమే
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డైలీ యాక్టివిటీ రేటు 0.13 శాతానికి గణనీయంగా పడిపోయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు కేవలం 5 మాత్రమే ఉన్నాయన్నారు. 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేశామని తెలిపారు. 15– 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి వందశాతం 2 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్నవారికి మొదటి డోసు 94.47 శాతం వ్యాక్సిన్లు వేశామని అధికారులు తెలిపారు.
ఉద్యోగాల భర్తీపై ఆరా
వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సీఎం జగన్ ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు.
ప్రజలకు వైద్య సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నామని సీఎం అన్నారు. వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదన్నారు. ప్రజలకు తప్పకుండా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేందుకు గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించామన్నారు.
ఆరోగ్య మిత్రలకు నగదు ప్రోత్సాహకాలు
ఆసుపత్రుల్లోని నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు. వసతులు, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు రానివ్వొద్దన్నారు. పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అలాగే గిరిజన ప్రాంతాల్లో స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. 16 మెడికల్ కాలేజీల్లో 6 చోట్ల నిర్మాణాలు సాగుతున్నాయని తెలిపారు. పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం మెడికల్ కాలేజీల్లో నిర్మాణాల ప్రగతిని అధికారులు వివరించారు. మిగిలిన చోట్ల మే 15 నాటికల్లా మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ఇంకా ప్రొసీజర్లను పెంచాలనుకుంటే పెంచాలని సీఎం జగన్ అన్నారు. ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలన్నారు. దీని ద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్టు అవుతుందన్నారు.