Loan For Education: ఉన్నత విద్య కోసం వడ్డీలేని రుణాలు, త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమలు: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu | ఉన్నత విద్య కోసం వడ్డీలేని రుణాలు అందిస్తామని, 14 ఏళ్ల తరువాత తిరిగి చెల్లించేలా సౌకర్యం కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.

అమరావతి: ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఊరట కలిగించే ప్రకటన చేశారు. వడ్డీలేని విద్య రుణాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రుణాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పావలా వడ్డీ పథకంతో అనుసంధానిస్తామని చెప్పారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఇది అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ పథకం కింద రుణాల మంజూరుకు ఎటువంటి భద్రత అవసరం లేదని, 14 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుందన్నారు. నైపుణ్య శిక్షణ కోర్సులకూ ఈ పథకం వర్తించనుందని పేర్కొన్నారు. విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా పావలా వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ సందర్భంగా ‘ఆడబిడ్డ నిధి’ పథకాన్ని కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. దీనిలో భాగంగా నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. ఇది అమ్మాయిల చదువును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉండబోతుందని పేర్కొన్నారు.
ఆర్టీసీ ఆధునికీకరణ.. అన్ని ఏసీ బస్సులే లక్ష్యం
ఆర్టీసీ బస్‌స్టాండ్లను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టే పనిలో ప్రభుత్వం ఉన్నదన్నారు. వాణిజ్య సముదాయాలు, కార్గో సేవలు, ప్రకటనల ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దేవుడి దయతో అన్ని బస్సులు ఏసీ బస్సులుగా మారే రోజులు దూరంలో లేవన్నారు.
కుల ధ్రువీకరణ పత్రాలు, శ్మశానాల స్థలాలు
త్వరలో శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. శ్మశాన వాటికల కోసం అవసరమైన స్థలాల కేటాయింపును కలెక్టర్లు ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు జర్నలిస్టుల గృహ నిర్మాణ పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పారు.

రజకుల కోసం ఆధునిక సదుపాయాలు
రాష్ట్రంలోని రజకుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 25 మందికి మించి ఉన్న ప్రతి చోట ఆధునిక ధోబీఘాట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇస్త్రీ చేసుకునే కోసం షెడ్లు, సోలార్ లేదా విద్యుత్తుతో నడిచే తోపుడు బండ్లు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వడ్డెరుల కోసం క్వారీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటామన్నారు.
యూనివర్సల్ హెల్త్‌కార్డు, యువతకు ఉద్యోగ మేళాలు
రాష్ట్రంలో త్వరలోనే యూనివర్సల్ హెల్త్‌కార్డ్ అమలులోకి రానుంది. డిజిటల్ కార్డుల రూపంలో ఇది అందుబాటులోకి రానుందని ఏపీ సీఎం వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల కేవైసీ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలన్నారు. ప్రతి జిల్లాలో యువతకు ఉపాధి కల్పించేలా జాబ్ మేళాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
క్రైస్తవుల కోసం చర్చిల నిర్మాణానికి ఆర్థిక సాయం
క్రైస్తవులకు సంబంధించిన చర్చిల నిర్మాణానికి మరియు మరమ్మతులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. జెరూసలేం యాత్రికులకు కూడా ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. క్రైస్తవ ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరిపి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడ హజ్‌హౌస్‌ను త్వరలో పూర్తి చేస్తామన్నారు. మసీదుల నిర్వహణ కోసం ప్రతి మసీదుకు రూ.5,000 ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
సుప్రీంకోర్టు జీవో 3ను కొట్టేసిన నేపథ్యంలో, గిరిజనుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం త్వరలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనుందని సీఎం చెప్పారు. వారికి న్యాయం జరిగేలా ముందడుగు వేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వ్యాపారాల విషయంలో భయపడిన ఆర్యవైశ్యులకు అనువైన వాతావరణాన్ని కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించామని పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కాపు భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన భూములను కేటాయించనున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు సీవీడ్ సాగుతో మంచి జీవనోపాధిని కల్పించేందుకు ప్రత్యేక శాఖ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ మోడల్ పై ప్రశంసలు
బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకున్న మోడల్‌ను ఇతర కార్పొరేషన్లు కూడా అనుసరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ నిధులను కార్పస్ ఫండ్‌గా నిలుపుకొని, దాతల సహాయంతో శాశ్వత ఆదాయాన్ని సృష్టించడం, ఆస్తుల సేకరణ వంటి మోడల్ సరైనదని చెప్పారు. కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములుగా మార్చిన తీరు అభినందనీయం అన్నారు.






















