Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో ఏ1గా చంద్రబాబు - ఛార్జిషీట్ దాఖలు చేసిన ఏపీ సీఐడీ
AP News: టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఫైబర్ నెట్ కేసులో ఆయన్ను ఏ1గా పేర్కొంటూ ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
AP Cid Charge Sheet Against Chandrababu in Fiber Net Case: టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) షాక్ తగిలింది. ఫైబర్ నెట్ కేసులో (FiberNet Case) ఆయన్ను ఏ-1గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో శుక్రవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఏ-2గా వేమూరి హరికృష్ణ, ఏ-3గా కోగంటి సాంబశివరావును చేర్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అప్పటి అధికార పార్టీ అవకతవకలకు పాల్పడినట్లు సీఐడీ ఆరోపించింది. రూ.2 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ తొలి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన 'టెరా సాఫ్ట్' కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని పేర్కొంది. చంద్రబాబు కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.114 కోట్ల నష్టం వాటిల్లిందని ఛార్జ్ షీట్ లో వెల్లడించింది. ఆయన కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కాం జరిగిందని.. నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వేమూరి హరికృష్ణను నియమించారని చెప్పింది. మిగతా కంపెనీలు టెండర్లు దాఖలు చేసినా.. వేమూరి హరికృష్ణకు టెండర్ దక్కేలా చేశారని తెలిపింది. స్కాం ద్వారా కొల్లగొట్టిన నగదును షెల్ కంపెనీల ద్వారా సొంత ఖాతాలకు మళ్లించారని పేర్కొంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను తిరస్కరించిందని.. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సీఐడీ తన ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది.
ఎఫ్ఐఆర్ లో సీఐడీ పేర్కొన్న అంశాలు
ఫైబర్ నెట్ కాంట్రాక్టును టెరా సాఫ్ట్ అనే సంస్థకు అక్రమ మార్గంలో టెండర్లు కట్టబెట్డారని సీఐడీ ఆరోపిస్తోంది. టెండర్ గడువు వారం రోజులు పొడిగించి ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపింది. ఈ వ్యవహారంలో వేమూరి హరిప్రసాద్ కీలకంగా వ్యవహరించారని, బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్ దక్కేలా చేశారని సీఐడీ అభియోగించింది. ఫైబర్ నెట్ ఫేజ్-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా రూ. 115 కోట్ల అవినీతిని సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సప్లైస్‌కు నాసిరకం ఈ - పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు ప్రభుత్వం టెరా సాఫ్ట్‌ను గతంలో బ్లాక్ లిస్టు పెట్టింది. అనంతరం ఈ సంస్థను బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే ఈ సంస్థను లిస్ట్ నుంచి తొలగించారు అప్పటి అధికారులు. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో కలిసి టెర్రాసాఫ్ట్ ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ను దక్కించుకుంది. అయితే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీని నిబంధనలకు విరుద్ధంగా టెరా సాఫ్ట్ కాంట్రాక్ట్ నుంచి తొలగించిందని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. రూ.కోట్లతో నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇదంతా చంద్రబాబు సూచనల మేరకే జరిగిందని సీఐడీ ఆరోపిస్తోంది.
Also Read: Nellore News: నెల్లూరు జిల్లాలో కోళ్లకు వైరస్ పై ప్రభుత్వం ప్రకటన - 712 ర్యాపిడ్ టీమ్స్ ఏర్పాటు