AP BJP On YSRCP: కుప్పం సభ ఖర్చు వైఎస్ఆర్‌సీపీ చెల్లించాలి - షర్మిల వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలన్న ఏపీ బీజేపీ !
ప్రజాధనంతో నిర్వహించిన సభలో రాజకీయాలు మాట్లాడటం ఏమిటని జగన్‌పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. పేరు మార్పుపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
AP BJP On YSRCP: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం పేరు మార్పుపై షర్మిల వ్యాఖ్యలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ ను అవమానించే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని షర్మిల అన్నారు. ఎన్టీఆర్ పేరు తీసేయడం కోట్ల మందిని అవమానించినట్లేనన్నారు. షర్మిల వ్యాఖ్యలు నేరుగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించినట్లుగా ఉండటంతో విపక్షాలు ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ అధినేతను ప్రశ్నిస్తున్నాయి. వైఎస్ఆర్ కుమార్తె షర్మిల వ్యక్తం చేసిన అభిప్రాయంతో పేరు మార్చిన కుమారుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నాయి. అదే అంశాన్ని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి తన వ్యవహారశైలి మార్చుకోవలాని లేకపోతే ప్రజలే మార్పు చేసే రోజులుకు దగ్గరకు వచ్చాయని స్పష్టం చేశారు.
ప్రజాధనంతో సభ - రాజకీయాలు మాట్లాడటం ఏమిటన్న విష్ణవర్ధన్ రెడ్డి
కుప్పం నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుపైనా విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంలా నిర్వహించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. ప్రజాపోరు సభల్లో భాగంగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్న విష్ణువర్దన్ రెడ్డి తిరుపతిలో ఉన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కుప్పం పర్యటనకు జగన్ వెళ్తే పాఠశాలలు మూసి వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో డబ్బు ఖర్చు పెట్టి సభ నిర్వహించి, ఆ సభలో రాజకీయాలు మాట్లాడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కుప్పం సభకు అయిన ఖర్చును వైఎస్ఆర్‌సీపీ ఖాతా నుంచి ఖజానాకు జమ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాపోరు సభలకు రాకుండా జనానికి వాలంటీర్లతో బెదిరింపులు
విజయవాడలో వాట్సాప్‌లో వార్త ఫార్వార్డ్ చేశారని సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును అరెస్ట్ చేసిన అంశాన్నీ విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ .. ప్రశ్నించేవారిని ఆణిచి వేస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని స్పష్టం చేశారు. బీజేపీ చేపడుతున్న ప్రజాపోరు సభలను కూడా ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రజలు రాకుండా వాలంటీర్లతో బెదిరింపులకు గురి చేస్తున్నారని విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ వైఎస్ఆర్‌సీపీ నిజ స్వరూపాన్ని వివరిస్తోందని ... వాళ్లకు నిజాలు తెలియకుండా వాలంటీర్లను ఉసిగొప్పి.. బీజేపీ మీటింగ్‌లకు వచ్చే వారిని బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బీజేపీ భయపడబోదని స్పష్టం చేశారు.
రోజుకు నాలుగు వదల ప్రజాపోరు సభలతో ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ
ఏపీ బీజేపీ నేతలు రోజుకు మూడు నుంచి నాలుగు వందల సభలు నిర్వహిస్తోంది. ప్రజాపోరు పేరుతో స్ట్రీట్ కార్నర్ సభలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తోంది. పలు చోట్ల జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ సభలకు హాజరవుతున్నారు. వీటి ద్వారా బలపడతామని ఏపీ బీజేపీ నేతలు నమ్మకంగా ఉన్నారు.