Ganta Srinivas resigns : మాజీ ఎమ్మెల్యేగా మారిన గంటా శ్రీనివాస్ - అప్పట్లో చేసిన రాజీనామా ఇప్పుడు ఆమోదం!
Ganta : ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాస్ చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం ఆయన తన రాజీనామాను రెండేళ్ల కిందట సమర్పించారు.
Ganta Srinivas resigns : విశాఖ నార్త్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావ చేసిన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి రెండేళ్ల కిందట గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. కానీ అప్పట్లో రాజీనామాను ఆమోదించలేదు. అసెంబ్లీకి కూడా గంటా శ్రీనివాసరావు హాజరు కాలేదు. అప్పుడు స్వయంగా స్పీకర్ ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే స్పీకర్ పట్టించుకోలేదు. ఇప్పుడు మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా రాజీనామాను ఆమోదించేసి గెజిట్ విడుదల చేశారు. దీనికి కారణం రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తుండటమేనని అంచనా వేస్తున్నారు. వరలో ఏపీ రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండటంతో ఆయన ఓటు వేయడానికి వీలు లేకుండా రాజీనామాను ఆమోదించినట్లు తెలుస్తోంది.
మార్చిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల బలాల ప్రకారం ఈ మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి. కానీ ప్రస్తుతం సీఎం జగన్ అభ్యర్థుల కసరత్తు చేస్తున్నారు. ఈ కారణంగా బదిలీ అయిన ఎమ్మెల్యేలు.. టిక్కెట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలు టీడీపీ వైపుకు వెళ్తే ఓ రాజ్యసభ స్థానం దక్కించుకోవడం కష్టమవుతుందన్న అంచనాలో ఆ పార్టీ వ్యూహకర్తలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే టీడీపీ బలాన్ని వీలైనంతగా తగ్గించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గంటా శ్రీనివాస్ రాజీనామాను ఆమోదించే ముందు ఆయనను ఒక్క సారి కూడా సంప్రదించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇప్పుడు రాజీనామా ఆమోదించినా ఆమోదించకపోయినా పెద్దగా తేడా లేదు. ఎందుకంటే నెల రోజులలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. కేవలం రాజ్యసభ ఎన్నికల దృష్టితోనే ఈ పని చేశారని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీకి ఓటు వేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆ నిర్ణయం తీసుకోలేదు. అాలా తసుకుంటే.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలపైనా అనర్హతా వేటు వేయాల్సి ఉంటుంది. అందుకే ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ సమయంలో ఆ నిర్ణయం తీసేసుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే పూర్తి స్థాయి మెజార్టీ ఉన్న వైసీపీ ఇలా ఒకరిద్దరు ఎమ్మెల్యేలను కుట్ర పూరితంగా మాజీలను చేసినంత మాత్రాన.. ఓటమి నుంచి తప్పించుకోలేరని టీడీపీ వర్గాలంటున్నాయి. నలభై మందికిపైగా ఎమ్మెల్యేలు టీడీపీవైపు వస్తారని చెబుతున్నారు. రాజ్యసభ స్థానం ఖచ్చితంగా గెలుస్తామని చెబుతున్నారు.