(Source: ECI | ABP NEWS)
AP Budget 2022: మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ ఎప్పుడంటే?
AP Budget 2022: మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 11న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

AP Budget Session: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(Budget) సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. మార్చి 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు(Assembly Session) జరగనున్నాయి. మార్చి 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్(Biswa Bhushan Harichandan) ప్రసంగిస్తారు. 8వ తేదీన మంత్రి గౌతమ్ రెడ్డి(Goutham Reddy) మృతికి సభలో సంతాపం తెలుపుతారు. మార్చి 11న బడ్జె్ట్ ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 7 నుంచి సమావేశాలు ప్రారంభాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త రాజధాని ఏర్పాటు, కొత్త జిల్లాలపై ప్రత్యేక బిల్లులను తీసుకురానున్నట్లు సమాచారం. అలాగే 2022-23 బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కొవిడ్ తీవ్రత లేకపోతే రెండు వారాలకుపైగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు రాజధానుల బిల్లు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులను సంబంధించిన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటుగా మూడు రాజధానుల్లోనూ ఒకేసారి పరిపాలనను ఆరంభించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఉగాది నుంచి అమలులోనికి రానున్నాయి. అయితే ఉగాదికి దాదాపు నెల రోజుల ఉన్నందున ఈ లోపులోనే అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవడంపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలుస్తోంది.
కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ!
ఏపీలోని జిల్లాల సంఖ్యను 26కు పెంచడంపై పాలనా సౌలభ్యం పరంగా హర్షం వ్యక్తమైనా పాత జిల్లాలను విభజించిన విధానంపై మాత్రం సొంత పార్టీ నేతల నుంచే వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురవుతుంది. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కడప నుంచి సైతం అసమ్మతి వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీటైన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం కనపడుతుంది.
టీడీపీ పరిస్థితి
గత అసెంబ్లీ సమావేశాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు తనను, తన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా అసభ్య పదజాలంతో దూషించారంటూ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు చంద్రబాబు. మళ్ళీ అధికారంలోకి వచ్చాకే శాసనసభలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ సైతం చేశారు. అయితే ఆ తరువాత మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకోవడం, కొత్త జిల్లాల ఏర్పాటు, OTS పథకం అమలులోనికి తేవడం వంటి కీలక కార్యక్రమాలు తెరపైకి తెచ్చింది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాగూ సభకు రారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను సభకు పంపిస్తారా లేకుంటే మొత్తానికే సమావేశాలను బహిష్కరిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.
గుడివాడ క్యాసినో వ్యవహారం
ఎప్పుడూ విపక్షాలపై తనదైన శైలిలో దూసుకుపోయే మంత్రి కొడాలి నానికి మాత్రం ఈ సమావేశాలు కాస్త కఠినం అనే చెప్పాలి. సంక్రాంతి సందర్బంగా వెలుగులోనికి వచ్చిన గుడివాడ క్యాసినో వ్యవహారం విపక్షాలకు ఒక ఆయుధంగా మారే అవకాశం కనపడుతుంది. విపక్ష సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలకు, ఆరోపణలకూ కొడాలి నాని ఎలా సమాధానం చెబుతారో చూడాలి.





















