Anganwadi Strike in AP: మంత్రి పెద్దిరెడ్డికి అంగన్వాడీల నిరసన సెగ, ఉరవకొండలో ఉద్రిక్తత!
Peddireddy Ramachandra Reddy: ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అంగన్వాడీలు మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.
Anganwadis stops Peddireddy Vehicle: ఉరవకొండ: ఏపీలో గత కొన్నిరోజులుగా ఏదో చోట మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఏదో చోట అంగన్వాడీల నుంచి నిరసన సెగ తగులుతోంది. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (AP Minister Peddireddy)కి చేదు అనుభవం ఎదురైంది. అంగన్వాడీలు మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకుని నిరసన (Anganwadi Strike in AP) తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అడ్డగించిన అంగన్వాడీలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 25న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లారు. అయితే ఉరవకొండ నియోజకవర్గంలో అంగన్వాడి వర్కర్లు ఒక్కసారిగా మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని, వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ముందుకు కదలకుండా అడ్డుకుని, రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అంగన్వాడీలను బలవంతంగా అక్కడినుంచి పక్కకు జరిపి.. మంత్రి పెద్దిరెడ్డి వాహనాన్ని ముందుకు పంపించారు. నెల రోజులకు పైగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు చేస్తున్న కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ నెల తరువాతే వేతనాల పెంపు
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఇటీవల మరో మంత్రి ఉషశ్రీ చరణ్ ను సైతం అంగన్వాడీలు ఇలాగే అడ్డుకున్నారు. ఇటీవల విజయనగరం జిల్లా మెంటాడ మండలం పర్యటన ముగించుకుని బొత్స సత్యనారాయణ విజయనగరం వెళుతున్నారు. ఈ క్రమంలో గజపతినగరంలో అంగన్వాడి వర్కర్స్ మంత్రి బొత్స సత్యనారాయణ వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ జీతాలు పెంచాలని కోరుతూ అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. తాను ఇంతకుముందే చెప్పినట్లు మూడు నెలల తరువాతే మీ వేతనాలు పెంచుతామని చెప్పారు.
ఒక్క డిమాండే మిగిలి ఉందన్న బొత్స
పలు దఫాలుగా అంగన్వాడీల ప్రతినిధులతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. కానీ ఇప్పట్లో వేతనాలు పెంచేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అంగన్వాడీల 11 డిమాండ్లలో ఇప్పటికే 10 డిమాండ్లు నెరవేర్చామని చెప్పారు. ప్రస్తుతం జీతాల పెంపు గురించి అడగవద్దని, 3 నెలల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అప్పుడు మీ డిమాండ్లు పరిష్కరిస్తామని బొత్స ఆ సమయంలో హామీ ఇవ్వడం తెలిసిందే.