CM Jagan Convoy Accident: సీఎం జగన్ కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం - వేరే వాహనంలో వెళ్లిపోయిన సీఎం
Andhrapradesh News: కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఇడుపులపాయ వస్తుండగా కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం జరిగింది. ఆయన వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది.
CM Jagan Convoy: వైఎస్సాఆర్ కడప ఇడుపులపాయ (Idupulapaya) పర్యటనలో ఉన్న సీఎం జగన్ (CM Jagan) కాన్వాయ్ శుక్రవారం స్వల్ప ప్రమాదానికి గురైంది. సీఎం వాహనాన్ని ఆయన కాన్వాయ్ లో మరో వాహనం ఢీకొట్టింది. దీంతో సీఎం జగన్ వాహనం దిగి వేరే వాహనంలో ఇడుపులపాయ ఎస్టేట్ కు వెళ్లారు. కాన్వాయ్ లో వాహనాలు వెళ్తుండగా ముందున్న వాహనం వేగం తగ్గడంతో వెనుక వాహనం ఢీకొట్టింది. వేముల మండలం వైసీపీ నేతలతో సమీక్ష అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా, ఇడుపుల పాయ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కడపకు వెళ్లి అక్కడి నుంచి విజయవాడ చేరుకుంటారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
సీఎం జగన్ తన 2 రోజుల కడప పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో రూ.1.75 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. అనంతరం అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ఎకో పార్కులో పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి పనులపై వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.
అభివృద్ధి పనులివే
గురువారం జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్.. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ. 64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
- భాకరాపురం రింగురోడ్డు సర్కిల్ లో 4 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.54 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయం ప్రారంభం.
- రూ.9.96 కోట్ల పాడా నిధులతో ఏపీ కార్ల్ నందు నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీల ప్రారంభం. ఈ కళాశాలలో బీఎస్సీ (Hon) అగ్రికల్చర్, హార్టికల్చర్ కు సంబంధించి బీఎస్సీ (Hon) హార్టికల్చర్ 61 సీట్లతో కోర్సులను అందిస్తున్నాయి.
- ఏపీ కార్ల్ నందు రూ. 11 కోట్లతో నిర్మించిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ లాబొరేటరీని సీఎం జగన్ ప్రారంభించారు. పాలు, పాల ఉత్పత్తుల కల్తీని తనిఖీ చేయడం, నాణ్యతా పరీక్ష డయాగ్నస్టిక్ సేవలు, ఆహార, తృణధాన్యాలు, పప్పుల నమూనాలను , ఫార్మా అప్లికేషన్ పరీక్షల నిర్వహణకై దీన్ని ఏర్పాటు చేశారు.
- పులివెందులలో మొత్తం 38 ఎకరాల్లో రూ .14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామంలో ఫేస్ లిఫ్టింగ్ పనుల ప్రారంభం. ఇందులో 28 ఎకరాల్లో శిల్పారామం కాగా 10 ఎకరాల్లో ఫంక్షన్ హాల్ ఉంది.
- మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ విత్ గ్యాలరీ, హిల్ టాప్ టవర్ విత్ 16.5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహం, హిల్ టాప్ పార్టీ జోన్, జిప్ లైన్ (రోప్ వే), బోటింగ్ ఐలాండ్ పార్టీ జోన్, చైల్డ్ ప్లే జోన్ ,వాటర్ ఫాల్, ఫుడ్ కోర్ట్, ఆర్టిసన్స్ స్టాల్ల్స్ తో పాటు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూర్చున్నట్లుగా ఎంట్రీ ప్లాజా, సీసీ రోడ్లు, పార్కింగ్ సదుపాయం, ఆహ్లాదకరమైన గ్రీనరీ దీని ప్రత్యేకతలు.
- రూ. 60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు సీఎం శంకుస్థాపన చేశారు.
Also Read: JC Prabhakar Reddy : వచ్చే ఎన్నికలు మాకు లైఫ్ అండ్ డెత్ - జేసీ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు