Ambati Rambabu: కేంద్ర బృందం ప్రశంసిస్తే కేంద్ర మంత్రి విమర్శలా.... వరదల్ని మానవ తప్పిదంతా చిత్రీకరించేందుకు ప్రయత్నం
అధికారం లేకపోయే సరికి చంద్రబాబుకు అన్నీ విషాద దినాలుగా కనిపిస్తాయని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. అన్నమయ్య కట్ట తెగిపోతే మానవ తప్పిదంగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం చాలా దురదృష్టకరమని, ఆయన మరణానికి సంతాప సూచకంగా.. రెండు తెలుగు రాష్ట్రాలు మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించాయని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈ సంతాప దినాల్లో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలకు ప్రతి విమర్శ చేసే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. చంద్రబాబుకు సంతాప దినాలు లేవు... సంతోష దినాలు లేవని.. అధికారం లేకపోతే అన్ని దినాలను విషాద దినాలుగా భావించే మనస్తత్వం చంద్రబాబుదని విమర్శించారు.
ప్రకృతి విపత్తుని మానవ తప్పిదంగా చిత్రీకరిస్తూ విమర్శలు
ఇటీవల రాయలసీమలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సగటున 10.7 శాతం వర్షపాతం నమోదైందన్నారు. కొండకు చిల్లు పడిందా.. అన్నట్టు కుండపోత వర్షాలు పడ్డాయని, దీంతో ఊహించని విపత్తు సంభవించిందన్నారు. తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. అన్నమయ్య డ్యామ్ కట్ట తెగి ఊళ్ల మీదకు వరద పోటెత్తిందని తెలిపారు. అన్నమయ్య కట్ట తెగడం మీద విమర్శలు చేస్తున్నారని, ఇది మానవ తప్పిదం కాదన్నారు. కానీ మానవ తప్పిదంగా చిత్రీకరించి వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసత్యాలు ప్రచారం చేసి ఏదోరకంగా ప్రభుత్వం పరువు తీయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో పెరిగిందంటే సీఎం జగన్ వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళితే.. "అక్కడ ప్రజలు తిరగబడలేదట. ఆయనతో ప్రేమగా మాట్లాడారట. ఇంత వరదలు వస్తే... జగన్ పై నిప్పులు చెరగాలి, దూషించాలి.. గడ్డం పట్టుకుంటారేంటే.. ఈ ప్రజలకు బుద్ధి ఉందా లేదా.." అని ప్రజల మీద చంద్రబాబు తిరుగుబాటు ప్రకటించారని అంబటి అన్నారు.
కేంద్ర మంత్రి తెలుసుకుని మాట్లాడాలి
సీఎం జగన్ కంటే ముందుగానే చంద్రబాబు వరద ప్రాంతాలకు వెళ్లి తానే ముందు వచ్చానని.. అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి ఆరోపించారు. చంద్రబాబు అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించడానికి బదులు "నా సతీమణిని తిట్టారు. మీరే న్యాయం చెప్పండి.." అంటూ బాధల్లో ఉన్నవారిని ఓదార్చాల్సింది పోయి, ఆయన బాధ చెప్పుకున్నారని విమర్శించారు. అన్నమయ్య కట్ట తెగిపోతే ఇది మానవ తప్పిదమా... ప్రకృతి విపత్తా.. అన్నది కేంద్ర మంత్రికైనా, రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతకైనా వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. సుజనా చౌదరో, సీఎం రమేష్ బ్యాక్ గ్రౌండ్ ఇస్తే.. వాళ్ల ఇచ్చిన రిపోర్టును పార్లమెంటులో చదవటం కాదని అంబటి విమర్శించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులు, జరిగిన నష్టంపై అంచనా వేసి వాస్తవాలను నివేదించాలని కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపించిందని, ఆ బృందం రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసించిదని గుర్తుచేశారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ఎవరో చెప్పింది విన్నారని ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు రిపేరు చేయాలని 2017లోనే డ్యామ్ సేఫ్టీ నిపుణులు రిపోర్టు ఇచ్చారు, కానీ అప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదని అంబటి విమర్శించారు.
Also Read: విశాఖ ఆర్కే బీచ్ లో ముందుకొచ్చిన సముద్రం... 200 మీటర్ల మేర కోతకు గురైన బీచ్... పర్యాటకులకు నో ఎంట్రీ
ఓటీఎస్ లో ఏం మోసం ఉంది
రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం చేసినా చంద్రబాబు విర్శమలు చేస్తుంటారని అంబటి అన్నారు. పేదల పక్కా ఇళ్లకు సంబంధించి వన్ టైం సెటిల్ మెంటు(ఓటీఎస్) స్కీములో మీరెవరూ కట్టొద్దు అని చంద్రబాబు చెబుతున్నారు. ఆ స్కీంలో ఏం మోసం ఉందో చెబితే బాగుండేదని అంబటి రాంబాబు అన్నారు. పక్కా ఇళ్ల లబ్ధిదారులకు ఓటీఎస్ పథకం ద్వారా పరిపూర్ణమైన హక్కులు కల్పిస్తుంటే వాటిని అమ్ముకోవచ్చు, బ్యాంకులలో పెట్టుకోవచ్చు.. అని చెబుతుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట...? అని విమర్శించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి