Weather Updates: ఏపీలో రెండు రోజులపాటు భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిక
AP Rains | ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాయలసీమలో భారీ వర్షాలు, కోస్తాంధ్రలో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులు పడతాయని హెచ్చరించారు.

Andhra Pradesh Rains News Update | అమరావతి: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నెల 22, 24 నాటికే నైరుతి రుతుపవనాలు (SouthWest Monsoon) కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మే 26న ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. మే 29న కోస్తాంధ్రతోపాటు ఏపీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. రెండు వారాల్లోనే నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించనున్నాయి. గతంలో ఓసారి 14 రోజుల్లోనే వేగంగా దేశమంతా వ్యాపించాయని నిపుణులు తెలిపారు.
దిగి రానున్న పగటి ఉష్ణోగ్రతలు
ఏపీలో మరో రెండు నుంచి మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. 2 రోజులపాటు రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురవనున్నాయి. గంటకు 50-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (#APSDMA) ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. హోర్డింగ్స్, చెట్ల క్రిందగానీ, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వద్ద తలదాచుకోవద్దని సూచించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదుకు అవకాశం ఉంది
రానున్న2రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు,గంటకు50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని #APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. హోర్డింగ్స్,చెట్ల క్రింద,శిథిలావస్థలో ఉన్న గోడలు,భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.ఉష్ణోగ్రతలు38°C-40°Cమధ్య నమోదుకు అవకాశం ఉంది pic.twitter.com/ApOASmUtdG
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 19, 2025
రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులకు అవకాశం
మే 20వ తేదీన రాయలసీమలో భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్రలోనూ కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం అంచనా వేసింది.






















