Power Demand In AP: ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన విద్యుత్ డిమాండ్-గరిష్టంగా 13,208 మెగావాట్లు
Andhra Pradesh News : ఏపీలో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. గ్రిడ్ గరిష్ట డిమాండ్ 13,028 మెగావాట్లకు చేరింది. డిమాండ్‌కు తగ్గ విద్యుత్‌ను కొనుగోలు చేసి సమస్యను అధిగమించినట్టు అధికారులు ప్రకటించారు.
Power Demand In AP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వర్షాలు సరిగా లేవు. పైగా ఎండలు మండుతున్నాయి. వర్షాకాలంలో కూడా ఉక్కపోత తప్పలేదు రాష్ట్ర ప్రజలు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చిన విద్యుత్ డిమాండ్... గరిష్టంగా 13,028 మెగావాట్లకు చేరింది. ఈ సమస్యను అధిగమించేందుకు విద్యుత్ ఎక్స్ఛేంజీలు, ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేశాయి. దీంతో విద్యుత్ సరఫరాకు సమస్య లేకుండా చేశాయని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు.
భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు, ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంధన డిమాండ్‌పై రాష్ట్ర ఇంధన శాఖ... ఏపీ ట్రాన్స్‌కో (APTRANSCO), ఏపీ జెన్కో (APGENCO), ఏపీ డిస్కమ్‌లతో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించింది. వివిధ కారణాల వల్ల విద్యుత్ డిమాండ్ ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగిందని... ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్ తెలిపారు.
ఎల్ నినో ప్రభావం వల్ల 2023-24 సంవత్సరంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో తగిన వర్షపాతం లేకపోవడంతో ఇంధన డిమాండ్ పెరిగింది. ప్రధాన రిజర్వాయర్‌లకు ఇన్‌ఫ్లోలు లేవు. జూన్ నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా వేడిగాలులు వీస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో కూడా... వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్‌ను అందించామని అన్నారు విజయానంద్.
గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది విద్యుత్ వినియోగం 30.8 శాతం పెరిగిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌టీపీపీ (RTPP) అత్యుత్తమ థర్మల్ ప్లాంటుగా గుర్తింపు సాధించిందని జెన్‌కో ఎండీ చక్రధర్‌బాబు చెప్పారు. విజయవాడ వీటీపీఎస్‌లో కొత్తగా నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ యూనిట్ పనితీరును కూడా పరిశీలిస్తున్నామన్నారు. డిసెంబరులో సీవోడీ పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
థర్మల్ ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు, ఏపీ జెన్కో (APGENCO) బొగ్గు నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోందని, బొగ్గు నిరంతర సరఫరా కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వేలతో సమన్వయం చేస్తోందని చెప్పారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఏప్రిల్ నుండి అక్టోబర్ 2023 వరకు 14,948 MU నుండి 17,102 MUకి మెరుగుపడిందన్నారు. 2022-23 సంవత్సరంలో 93 శాతం (12.40 మిలియన్ టన్నులు) నుండి 96.52 శాతానికి (14.74 మిలియన్ టన్నులు) బొగ్గు అనుసంధానం మెరుగుపడిందని చెప్పారు.