AP Cyclone Effect: తీవ్రవాయుగుండంగా మిగ్‌జామ్-ఏపీలో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఏపీని అతలాకుతలం చేస్తూనే ఉంది మిగ్‌జామ్. తీవ్ర తుపాన్ బలహీనపడి వాయుగండంగా మారింది. ఐదు జిల్లాలకు అరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ కూడా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
Cyclone Effect in Andra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభ్సతం సృష్టిస్తున్నాయి. తీవ్రతుపాన్ తీరం దాటి క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతోంది. దీంతో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి జిల్లా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు.
మరోవైపు.. ఇవాళ కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో ఇవాళ.. ఆయా జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జామ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. భీకర గాలులతో ప్రజలను బెంబేలెత్తించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాలను కుదిపేసింది. కుండపోత వర్షాలకు తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. నెల్లూరు నగరం కూడా నీటమునిగింది. నెల్లూరులో ధనికులు ఉండే ప్రాంతం.. మాంగుంట లేవుడ్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఎన్నడూ లేనంత వర్షాన్ని చూశారు నెల్లూరు జిల్లా ప్రజలు. భారీ వర్షాలకు తోడు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో జిల్లా మొత్తం వణికిపోయింది. మూడు రోజులు.. ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది. ఈ వర్షాలకు లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకుపైగా నీళ్లు ఉండిపోయాయి. దీంతో రాకపోకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నెల్లూరు-చెన్నై మధ్య రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. కరెంటు స్తంభాలు పడిపోయాయి. భారీ వృక్షాలు సైతం నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సహాయక చర్యలకు కూడా భారీ వర్షాలు అంతరాయం కలిగించాయి. చిత్తూరు జిల్లాను కూడా చిగురుటాకులా వణికించింది మిగ్‌జామ్ తుఫాన్. తిరుపతి నగరం కూడా పూర్తిగా జలమయమైంది. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వర్షం కురిసింది.
గోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో టోర్నడోలు ఏర్పడ్డాయి. సుమద్రతీర ప్రాంతాల్లో నల్లమబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. అల్లూరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కోనసీమ జిల్లాలో పంట నష్టం భారీగా ఉంది. ప్రాథమికంగా 10వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో... పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడలోనూ తుఫాన్ బీభత్సం సృష్టించింది. వర్షాల కారణంగా దుర్గగుడి ఘాట్ రోడ్డు కూడా మూసివేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కనకదుర్గ నగర్ మార్గం గుండూ రావాలని సూచించారు అధికారులు.