Adimulapu Suresh: విద్యార్థుల ముసుగులో రాళ్లదాడి... విద్యా వ్యవస్థతో రాజకీయాలు చేస్తే ఖబడ్దార్.. మంత్రి ఆదిమూలపు సురేశ్ హెచ్చరిక
అనంతపురం ఎస్ఎస్బీఎన్ కాలేజీ ఘటన దురదృష్టకరమని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. విద్యార్థుల ముసుగులో దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారని ఆరోపించారు.
అనంతపురం ఎస్ఎస్బీఎన్ కాలేజీ ఘటనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ధర్నాలో కొందరు దుండగులు చొరబడ్డారన్నారని ఆరోపించారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా్ర్థి సంఘాల ముసుగులో దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వి విద్యార్థిని గాయపర్చారన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి అన్నారు. అవాస్తవ ప్రచారానికి కొన్ని మీడియా సంస్థలు మద్దతు పలుకుతున్నాయని మంత్రి ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందన్నారు. విద్యార్థినిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసులు లాఠీచార్జ్ చేయలేదంటూ బాధిత విద్యార్థినే చెప్పిందని మంత్రి అన్నారు. దుండగులు వేసిన రాళ్ల దాడిలోనే విద్యార్థిని గాయపడిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల పనితీరుపై కమిటీ వేశామన్న మంత్రి.. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read: ఆయన కంఠంలో ‘ఉక్కు’ తూటా! స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోపోరుకు సిద్ధమైన శంకరరావు..
విద్యార్థుల జోలికొస్తే ఖబడ్దార్
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రతిపక్ష పార్టీలు ఆటలాడుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ హెచ్చరించారు. అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై ఒక నివేదిక తీసుకున్నామని మంత్రి సురేశ్ తెలిపారు. ఆ విద్యాసంస్థ 1991 నుంచి నడుస్తున్నట్టు పేర్కొన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కళాశాల వద్దని యాజమాన్యమే చెప్పినట్లు తెలిపారు. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చూస్తున్న వారికి ఖబడ్దార్ అని మంత్రి హెచ్చరించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేశ్ విద్యార్థులతో రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు తెచ్చారని గుర్తుచేశారు. పోలీసులపై రాళ్లు, చెప్పులు వేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న మంత్రి... సంస్కరణల్లో భాగంగానే గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిలిపివేశామని, 400కు పైగా పాఠశాలల్లో సున్నా ప్రవేశాలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: అనంత విద్యార్థులపై విరిగిన లాఠీ... ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత
అసలేం జరిగింది
అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్ ఎయిడెడ్ కళాశాలలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఎయిడెడ్ కళాశాలల విలీనం ఆపాలని విద్యార్థి సంఘాలు ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య సుమారు గంటపాటు తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొంతమంది రాళ్లు రువ్వారు. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తలకు గాయమైంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళన మరింత ఉద్ధృతం చేశారు. పరిస్థితి ఉద్ధృతంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేయాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసులకు మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి వాహనంలో తరిలిస్తుండగా పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారు. కానీ పోలీసులు లాఠీఛార్జ్ చేయలేదని, గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారన్నారు.
Also Read: ఎయిడెడ్ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?





















