Andhra Pradesh development projects In 2022 : కొత్త జిల్లాలు ఏర్పాటు - కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన ! ఏపీలో 2022 అభివృద్ది మైలు రాళ్లు ఇవిగో
ఆంధ్రప్రదేశ్‌లో 2022లో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదు. కానీ కీలకమైన నిర్ణdయాలు తీసుకున్నారు.
Andhra Pradesh development projects In 2022 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022లో కీలకమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసింది. భారీ ప్రాజెక్టులు ప్రారంభించకపోయినా.. ఆంధ్రప్రదేశ్ రాత మర్చే నిర్ణయాలు తీసుకుంది. భారీగా మౌలిక సదుపాయాలు కల్పించే ప్రాజెక్టులు పెద్దగా ప్రారంభం కాలేదు. అదే సమయంలో శంకుస్థాపనలు కూడా పెద్దగా జరగగలేదు. ఏపీ ప్రభుత్వ మొదటి చాయిస్ సంక్షేమ పథకాలు. అందుకే అభివృద్ధి విషయంలో మైల్ స్టోన్ అనే కార్యక్రమాన్ని ఈ ఏడాది చేయలేకపోయారు కానీ.. అలాంటి నిర్ణయం మాత్రం తీసుకున్నారు.
ఏపీలో ఉనికిలోకి కొత్త జిల్లాలు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉనికిలోకి వచ్చాయి. ఏపీ జిల్లాలు 13 నుంచి 26కు పెంచారు. గతంలో సగటు జిల్లా జనాభా 38.15 లక్షలు అ..ఇప్పుడు జిల్లా సగటు జనాభా 19.07 లక్షలు . 18 లక్షల నుంచి 23 లక్షల జనాభా ఉండేలా జిల్లాల విభజన చేశారు. రెవెన్యూ డివిజన్లను 51 నుంచి 72కు పెంచారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే విస్తీర్ణం దృష్ట్యా అరకును మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. మిగిలినవన్నీ పాత జిల్లాలు.
రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం !
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని జగన్ ఈ ఏడాదే ప్రారంభించారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణంపై దశాబ్దాలుగా ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేజర్ పోర్టు ఏపీకి రావాలి. అయితే, రాజకీయ నేతల్లో సరైన సంకల్పం లేకపోవడం వల్ల ఈ ప్రదపాదన అటకెక్కింది. అయితే, 2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పడటం జరిగిపోవడంతో ఓడరేవు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. రామాయపట్నం ఓడరేవును దశలవారీగా అభివృద్ధి చేసేందుకు రెండేండ్ల క్రితం ఏపీ మంత్రిమండలి ఆమోదించి.. ఆ మేరకు బడ్జెట్‌లో దాదాపు రూ.3 వేల కోట్లు కేటాయించారు. రెండు సంస్థలు సంయుక్తంగా రూ.2,650 కోట్లకు దక్కించుకున్నాయి.పనులు ప్రారంభించాయి.
సంగం, నెల్లూరు బ్యారేజీలు ప్రారంభం
సంగం బ్యారేజ్ కి 2008లో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేయగా, ఆయన తనయుడు జగన్ హయాంలో ప్రాజెక్ట్ పూర్తయింది. ఈ ఏడాదే ప్రారంభించారు కూడా. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి అప్పట్లో తలపెట్టిన జలయజ్ఞంలో భాగంగానే పెన్నా బ్యారేజీ, సంగం బ్యారేజీలకు ఆయన శంకుస్థాపన చేశారు. అయితే మహానేత హఠాన్మరణం తర్వాత ఈ బ్యారేజీల నిర్మాణం నత్తనడకలా సాగింది. ఆ తర్వాత ఏపీ రెండుగా విడిపోవడంతో నెల్లూరు జిల్లా వాసుల కల కలగానే మిగిలిపోయింది. మొత్తం రూ.131 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీని పూర్తి చేశారు. అలాగే 1195 మీటర్ల పొడవుతో రెండు లైన్ల బ్రిడ్జి రోడ్ కూడా నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 3.85 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. వరదలకు అడ్డకట్ట వేసి.. నెల్లూరుతో పాటు బ్యారేజ్ దిగువన ఉన్న గ్రామాలకు ముంపు ముప్పు బారి నుంచి తప్పించారు.
ప్రారంభమైన కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ మూడో యూనిట్
ఏపీ జెన్‌కో నెల్లూరు జిల్లాలో దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం)లో మూడో యూనిట్ ప్రారంభమయింది. కృష్ణపట్నంలో మొదటి దశలో 800 మెగావాట్ల రెండు సూపర్ క్రిటికల్ (అత్యాధునిక -టె-క్నాలజీ) థర్మల్ యూనిట్లను నిర్మించారు. రెండో దశలో మరొక ప్లాంట్‌ను 2015లో ప్రారంభించారు. మూడో దశ 2018లోనే పూర్తవ్వాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాలతో అది ఆలస్యం అయింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రెండు థర్మల్ ప్లాంట్ల పనులపై దృష్టి పెట్టింది. వేగంగా పూర్తి చేసి జగన్ ప్రారంభించారు.
నాడు-నేడుతో స్కూళ్ల పనులు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు కొత్తరూపురేఖలు తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఈ మార్పు కనిపించింది. అరకొర వసతులలోనే విద్యాబోధనలు జరిగే పాఠశాల్లలో మౌలిక సదుపాయాలు పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలు నూతన ఒరవడిని సంతరించుకున్నాయి. టాయిలెట్స్, గ్రీన్ బోర్డ్స్, ప్లే గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇలా విద్యార్థులు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేశారు. ఆహ్లాదకర వాతావరణం లో నేడు అక్కడ విద్యా బోధనలు జరుగుతున్నాయి.
30 లక్షల ఇళ్ల నిర్మాణాలు
ఏపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో సెంట్ స్థలాలను పంపిణీ చేసింది. ఇందుకోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాల్లో సేకరించారు. పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తున్న 17,005 కాలనీల్లో నిర్మాణాలు చేస్తున్నారు. 30.76లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రణాళికలు వేసార.ు తొలి దశలో 10,067 కాలనీల్లో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యాయి. రూ.28 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. అనేక విమర్శలు ఉన్నా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుని.. ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తోంది.
మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన
ఈ ఏడాదే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో ఒకే రోజున 14 వైద్య కళాశాలల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఒకేసారి ఇన్ని వైద్య కళాశాలలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం దేశంలోనే అరుదైన రికార్డు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుండగా.. అంతకు ముందే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అంటే ఒకేసారి 16 మెడికల్ కాలేజీలు.. వాటికి అనుబంధంగా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రమారమి 2 వేల ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. సుమారు 32 విభాగాలకు సంబంధించి స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం 16 వైద్య కళాశాలలను 2023 నాటికి అందుబాటులోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుగు సాగుతోంది.
ఏపీలో మొదటి అక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటవుతున్న ఫిషరీస్ యూనివర్సిటీకీ సీఎం జగన్ ఈ ఏడాదే శంకుస్థాపన చేశారు. అక్వా రంగంలో దేశం మొత్తంలో .జరుగుతున్న మత్స్య ఉత్పత్తిలో సింహభాగం 75 శాతం ఏపీ నుంచే ఉంది. అక్వారంగంలో పెట్టుబడులు ఖర్చులు తగ్గించి సన్నకారు రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో నాణ్యమైనచేపలు, రొయ్యల ఉత్పత్తితోపాటు నాణ్యమైనపీడ్‌ను అందించడానికి అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోంది. ఏపీ అక్వారంగంలో 17 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అక్వా యూనివర్శిటీ అందుబాటులోకి వస్తే వీరందరికీ మేలు జరుగుతుంది.
కడప సీబీఆర్ ప్రాజెక్ట్ ‘జెట్టీ’ని ప్రారంభం
కడప జిల్లాలో కొత్తగా టూరిజం ప్రాజెక్ట్ ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చింది. లింగాల మండలం పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా రూ.4.1 కోట్లతో నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్, పార్కును, రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన బోటింగ్, జెట్టీలను సీఎం జగన్ ప్రారంభించారు. ఇందులో పాంటున్ బోటు (15 కెపాసిటీ), డీలక్స్ బోట్ (22 కెపాసిటీ), 6 సీటర్ స్పీడ్ బోట్, 4 సీటర్ స్పీడ్ బోట్లు ఉన్నాయి.