Chandrababu on Telangana Election Results: 'అహంకార ఫలితం తెలంగాణలో చూశాం' - ఏపీలోనూ అదే రిపీట్ అవుతుందంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Andhra News: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తొలిసారి స్పందించారు. అహంకారంతో ఉంటే ఏం జరిగిందో చూశామని, అదే ఏపీలో రిపీట్ అవుతుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Chandrababu Comments on Telangana Election Results: ఏపీలో జగన్ (CM Jagan) ప్రభుత్వం అహంకారంతో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించారు. అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామని, మరో 3 నెలల్లో ఏపీలో కూడా చూస్తామని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం మిగ్ జాం తుపాను (Michaung Cyclone) ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నందివెలుగులో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పొలాల్లోకి దిగి స్వయంగా నీట మునిగిన పంటను పరిశీలించారు. ఈ క్రమంలో తెనాలికి చేరుకునే సమయంలో వీఎస్ఆర్, ఎస్వీఆర్ కళాశాల విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా నిల్చొని చంద్రబాబుకు స్వాగతం పలికారు.
అధికారంలో ఉన్నవారు రాకుండా... ప్రతిపక్షంలో ఉన్న నేను ముందుగా వస్తే రాజకీయాలు చేస్తున్నామన్నారు. వాళ్ళు రాక, నేను రాకపోతే కష్టాల్లో ఉన్న ప్రజలు ఏమై పోవాలి ? అందుకే వచ్చాను.
— Telugu Desam Party (@JaiTDP) December 8, 2023
- నారా చంద్రబాబునాయుడు గారు#CBNwithCycloneVictims #CycloneMichaung#NCBN #CBNInGuntur pic.twitter.com/uLEeS0B4mx
'ఎంతో క్షోభ అనుభవించా'
40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఎక్కడా తాను తప్పు చేయలేదని, అంతా చట్ట ప్రకారమే పని చేశానని చంద్రబాబు స్పష్టం చేశారు. చేయని తప్పునకు తనను అరెస్ట్ చేశారని, ఎంతో క్షోభ అనుభవించినట్లు చెప్పారు. తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తే తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. తాను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని తెలిసే సీఎం జగన్ హడావుడిగా పర్యటన మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. అయితే, తుపాను ప్రాంతాల్లో తప్ప ఎక్కడో తిరుగుతున్నారని విమర్శించారు.
'నేనే పరిహారం ఇస్తా'
'మిగ్ జాం' తుపాను ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చంద్రబాబు అన్నారు. 'ఈ తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందన్న సమయంలో ఇలా జరగడం బాధాకరం. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యింది. ఈ క్రమంలోనే ఎక్కువ నష్టం జరిగింది. డ్రైనేజీలో పూడిక తీయక పొలాల్లోకి మురికి నీళ్లు వస్తున్నాయి. అన్నదాతలు ఇంత ఇబ్బంది పడుతున్నా అధికారులు ఎవరూ సకాలంలో రాలేదు. తుపాను వల్ల రైతులు ఎకరాకు రూ.50 వేలు నష్టపోయారు. రైతులకు ఏమైనా ఇన్ పుట్ సబ్సిడీ వచ్చిందా.? మనకు జరిగిన అన్యాయంపై పోరాడదాం. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే బాధ్యత నాది. వైసీపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే, 3 నెలల తర్వాత నేనే పరిహారం అందిస్తాను. కౌలు రైతులకు కూడా పూర్తి స్థాయిలో సాయం అందిస్తాం.' అని చంద్రబాబు తెలిపారు. అప్పుడు కరువు, ఇప్పుడు తుపాను రైతులను దెబ్బ తీశాయని, దేశంలోనే రైతులు ఎక్కువగా అప్పుల పాలైంది ఏపీలోనే అని అన్నారు. పట్టిసీమ నీరు వదిలి ఉంటే ఈ సరికే రైతులు పంటల్ని కాపాడుకునే వారని చెప్పారు. తన షెడ్యూల్ ఖరారైతే తప్ప సీఎం, అధికారుల్లో కదలిక లేదని ఎద్దేవా చేశారు.