Heavy Rains in Andhra Due to Michaung Cyclone: తీరాన్ని తాకిన మిగ్ జాం తుపాను - జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులతో బీభత్సం
Michaung Cyclone: మిగ్ జాం తుపాను ప్రభావంతో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల సమీపంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Michaung Affect in AP: మిగ్ జాం తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల సమీపంలో ఈ తుపాను తీరాన్ని తాకింది. మరో గంట వ్యవధిలో పూర్తిగా తీరాన్ని దాటనున్నట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. మరో గంటలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత స్వల్పంగా బలహీనపడనున్న తీవ్ర తుపాను, సాయంత్రానికి బలపడే సూచనలున్నాయన్నారు. తుపాను తీరం దాటి సమయంలో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరం దాటుతున్న సమయంలో సముద్రంలో అలలు సుమారు 2 మీటర్ల మేర ఎగిసి పడుతున్నాయి. మరోవైపు, ఇప్పటివరకూ 211 సహాయక శిబిరాల్లో 9,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, బాపట్ల, ప్రకాశం సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
వర్షపాతం వివరాలివే
తుపాన్ కారణంగా తీరప్రాంతాల్లో ఈదురు గాలులతో చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉదయం 6.30 గంటల వరకు బాపట్లలో 21.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, నెల్లూరు 28.95, మచిలీపట్నం 14.93, కావలి 14.26, ఒంగోలు 11.44, కాకినాడ 5.9, నర్సాపూర్ 5.85, అనకాపల్లి 3.35, పొదలకూరు 20.75, రేపల్లె 1.17, చిత్తూరు 1.25, నర్సారావుపేట 1.15 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే నిజాంపట్నం హార్బర్ లో అధికారులు పదో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, గడిచిన 20 సంవత్సరాల్లో నిజాంపట్నం హార్బర్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి
- ప్రకాశం జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొల్లూరు మండలం తోకలవానిపాలెంలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. తీవ్ర గాలులతో పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి.
- తూ.గో జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, రామచంద్రపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, అమలాపురం మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కాకినాడ, పిఠాపురం, పెద్దాపురంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జగ్గంపేట, పత్తిపాడు, తుని మండలాల్లో ఈదురుగాలులతో వరి పంట నేలకొరిగింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంటలు తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. 9 మండలాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, కావలి, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. వర్షం, ఈదురుగాలులతో చలి తీవ్రత పెరిగిపోయింది.
- విజయవాడలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇంద్రాకీలాద్రి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లా దివిసీమలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగాయలంక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
- ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మిగ్ జాం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. పంట పొలాల్లోకి నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఒక్కో గేటును ఎత్తి టీటీడీ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
Also Read: Michaung Cyclone Affect in AP: మిగ్ జాం ఎఫెక్ట్ - తిరుపతి నగరం అతలాకుతలం, సహాయక చర్యలు ముమ్మరం