Michaung Cyclone: తీరం దాటిన మిగ్ జాం - 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు
Andhra News: మిగ్ జాం తుపాను బాపట్ల వద్ద తీరం దాటిన నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి గంటకు 90 - 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
Michaung Cyclone in AP: మిగ్ జాం తుపాను బాపట్ల వద్ద తీరం దాటింది. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్ని గంటల్లో తీవ్ర తుపాను బలహీనపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం వాయుగుండంగా బలహీనపడుతుందని చెప్పారు. తుపాను తీరం దాటినా ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని సూచించారు. తుపాను తీరం దాటిన సమయంలో బాపట్ల తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి.
11 జిల్లాలకు రెడ్ అలర్ట్
మరోవైపు, తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. 11 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. పలు చోట్ల ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధిత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
నీట మునిగిన పంటలు
తుపాను ప్రభావంతో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ పూర్తిగా నీట మునిగింది. పలు దుకాణాల్లో వరద చేరి దెబ్బతిన్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు, కృష్ణా జిల్లాలో భారీగా వరికి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 2.83 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, పంట నష్టంపై వర్షం తగ్గిన తర్వాత అంచనా వేసి రైతులకు పరిహారం ఇస్తామని జిల్లా కలెక్టర్ రాజబాబు తెలిపారు. అలాగే, ప.గో, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ నష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుపాను ప్రభావంతో వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఏలూరు ఆస్పత్రి వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఆస్పత్రి లోపల నీరు చేరి రోగులు ఇబ్బంది పడ్డారు. పెదవేగి, పెదపాడు, వట్లూరు తదితర ప్రాంతాల్లో రహదారికి అడ్డంగా చెట్లు కూలిపోగా, అధికారులు తొలగించే చర్యలు చేపట్టారు. పోలవరం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం తదితర మండలాల్లో వేరుశనగ, పొగాకు, మినుము పంటలు నీట మునిగినట్లు అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో శ్రీకాళహస్తిలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పల్లం రహదారిపై వాగులు పొంగి పొర్లుతున్నాయి. పాపానాయుడు పేట - చెన్నంపల్లి రహదారి కొట్టుకుపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పేదల గుడిసెల్లోకి నీరు చేరడంతో అధికారులు అక్కడి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
అటు, కోనసీమ జిల్లాలో దాదాపు 9 వేల ఎకరాలపై తుపాను ప్రభావం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే లక్షా 6 వేల ఎకరాల్లో పంట కోతలు పూర్తయ్యాయని, ఇంకా 51 వేల ఎకరాల్లో మాత్రమే కొతలు కోయాల్సి ఉందని చెప్పారు. అయితే, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Also Read: Michaung Cyclone Affect in AP: మిగ్ జాం ఎఫెక్ట్ - తిరుపతి నగరం అతలాకుతలం, సహాయక చర్యలు ముమ్మరం