Tomato Price: ఏపీలో అక్కడ రూ.50కే కేజీ టమాటా, ఉదయం నుంచే 2 కిలోమీటర్ల క్యూలో ప్రజలు
కడప ప్రజలు ఉదయం 5 గంటల నుంచే రాయితీ టమాటాల కోసం ఎగబడ్డారు. రాయితీ టమాటా కొనుగోలు చేసేందుకు సుమారు 2 కిలో మీటర్ల మేరకు ప్రజలు బారులు తీరారు.
Tomoto Price In AP: టామాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కిలో టమాటా రూ.150 వరకు పలుకుతోంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కిలో. 250 పైనే ఉంది. అక్కడ చికెన్ ధరలతో టమాటా పోటీ పడుతోంది. దీంతో సగటు మద్య తరగతి కుంటుంబం వంటల్లో టమాటా కనపించడం లేదు. గత వారం ఉత్తరాఖండ్‌లో కిలో టమాటా రూ.300 మార్క్ దాటింది. దీంతో టమాటా కొనాలంటేనే జనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాయితీపై టమాటా విక్రయాలు
జూన్ నెల వరకు ఆంధ్రప్రదేశ్‌లో కిలో రూ.40 ఉన్న టమాట జులై మొదటి వారానికి కిలో 120కి చేరింది. దీంతో సామాన్యుడు టమాట కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజల కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం రాయితీపై తక్కువ ధరకే టమాటా విక్రయాలను చేపట్టింది. ప్రధాన పట్టణాలు, నగరాల్లో కేవలం రూ.50 కే కేజీ టమాటా చొప్పున అమ్మే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రైతు బజార్లలో ప్రత్యేకంగా విక్రయాలు చేపట్టింది.
కడపలో 2 కిలోమీటర్ల క్యూ
ఈ నేపథ్యంలో కడప రైతు బజార్లో సైతం మంగళవారం రూ.48కే కిలో టమాటా విక్రయించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ప్రజలు ఉదయం 5 గంటల నుంచే రాయితీ టమాటాల కోసం ఎగబడ్డారు. రాయితీ టమాటా కొనుగోలు చేసేందుకు సుమారు 2 కిలో మీటర్ల మేరకు ప్రజలు బారులు తీరారు. మధ్యాహ్నం దాటినా కూలో వినియోగదారులు తగ్గలేదు. దాదాపు రెండు టన్నుల టమాటాలను అధికారులు విక్రయానికి ఉంచారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.130 నుంచి 150 వరకు పలుకుతున్నాయి.
అధికారుల తీరుపై వినియోగదారుల విమర్శలు
రాయితీ టమాటాల విక్రయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలకు నామమాత్రంగా విక్రయిస్తున్న పెద్ద ఎత్తున పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేవలం అధికారులతో పరిచయాలు ఉన్నవారు, బంధువులకు మాత్రమే విక్రయిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. గంటలకొద్ది క్యూలో ఉన్నా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. విక్రయ కౌంటర్లను పెంచడం ద్వారా ప్రజల రద్దీని తగ్గించవచ్చని సూచించారు.
ఇతర రాష్ట్రాల్లోనూ రాయితీ టమాట
అటు, తమిళనాడులోని స్టాలిన్ సర్కారు కూడా రూ.60లకు కిలో టమాటాలను అందజేస్తోంది. ఇక, కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో రూ. 101 నుంచి 121 వరకు టమాటా ధర ఉంది. కొన్ని చోట్ల టమాటూ మూడు వందలకు చేరుతుందని సైతం రిపోర్టులు వస్తున్నాయి.
పెరుగుతున్న టామాటా దొంగతనాలు
టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో వాటికి డిమాండ్ ఏర్పడింది. రాత్రి పూట దొంగలు పొలాల్లో చొరబడి కాయలను కోసుకుపోతున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ మహిళా రైతుకు చెందిన పొలంలో టమాటా పంట అంతా దొంగల పాలైంది. దాదాపు రూ.2.5 లక్షల విలువైన టమాటాలను దుండగులు ఎత్తుకెళ్లారు. టమాటా సాగు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నానని, వాటిని ఎలా కట్టాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు. తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని మార్కెట్‌లో టమాటాతో పాటు పచ్చిమిర్చి బాక్సులు చోరీకి గురయ్యాయి. అక్కడే ఉన్న సీసీటీవీని పరిశీలించిన పోలీసులు దొంగతనం జరిగిందని వెల్లడించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial