JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
JC Prabhakar Reddy: వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రులు బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ బస్సు యాత్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
JC Prabhakar Reddy On Ministers Bus Yatra : ఏపీ మంత్రుల బస్సు యాత్రపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారన్నారు. మంత్రుల బస్సు యాత్రకు పోలీసు రక్షణ పెంచుకోవాలని, ప్రజలు ఆగ్రహంతో రాళ్లు విసురుతారేమో అని ఎద్దేవా చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన జేసీపీఆర్.. తమ పార్టీ నేత కాలవ శ్రీనివాసులును రాయదుర్గంలో అడ్డుకోవడంపై మండిపడ్డారు. టీడీపీ నేతలను కనీసం ఆలయానికి కూడా వెళ్లనివ్వరాని అని ప్రశ్నించారు.
బస్సు యాత్రపై రాళ్లు
మంత్రులు చేపట్టే బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశాలున్నాయని, అలా జరగొచ్చని తనకు అనుమానాలు ఉన్నాయని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బస్సులకు సేఫ్ గార్డ్‌లు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. పోలీసులు వాహనాలకు ఉపయోగించే ఫెన్సింగ్ పెట్టుకోవాలన్నారు. పోలీసుల అండతో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు అరాచకాలు చేస్తున్నారని జేసీ ఆరోపించారు. త్వరలో కాలువ శ్రీనివాసులుతో కలిసి రాయదుర్గం ఆలయానికి వెళతానని ఆయన స్పష్టం చేశారు. తాడిపత్రిలో జాతీయస్థాయి మహిళా గ్రామీణ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఈ సమావేశంలో చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారిణిలు ఇప్పటికే తాడిపత్రి చేరుకున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రుల బస్సు యాత్ర
వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి మూడేళ్లు కాబోతుండడంతో మంత్రులు బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. సామాజిక న్యాయభేరి పేరుతో మంత్రులు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈనెల 26న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమై 29వ తేదీన అనంతపురంలో ముగుస్తుంది. ఈ బస్సు యాత్ర సందర్భంగా రోజూ ఒకచోట బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జేసీ కామెంట్స్ పై వైసీపీ నేతలు, మంత్రులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
ఏపీ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించడమే ప్రధాన అజెండాగా ఈ బస్సు యాత్ర జరగనుంది. సీఎం జగన్ కేబినెట్‌లో అధిక ప్రాధాన్యం కల్పించిన 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొని బస్సు యాత్రను విజయవంతం చేయనున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.