Chowdary vs Naidu: తెలుగుదేశానికి కల్యాణదుర్గం టిక్కెట్ కత్తిమీద సామే, టిక్కెట్ కోసం పోటీపడుతున్న చౌదరి, నాయుడు
Chowdary vs Naidu: కల్యాణదుర్గంల తెలుగుదేశంలో వర్గపోరు తీవ్రమవుతోంది. టిక్కెట్ కోసం హనుమంతరాయచౌదరి, ఉమామహేశ్వరనాయుడు వర్గం పట్టుబడుతోంది.
సార్వత్రిక ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల్లో టిక్కెట్ల కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. టిక్కెట్ నాకు అంటే నాకు అంటూ భీష్మించుకూర్చోవడంతో ….కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. టిక్కెట్ తనకు దక్కకుంటే....తప్పకుండా పార్టీ అభ్యర్థిని ఓడించి తీరుతామని శపథాలు చేస్తుండటం...అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారింది. అధికారంలోకి వచ్చాక ఎదో విధంగా సర్దుబాటు చేస్తామని బ్రతిమాలుకుంటున్నా...ఆశావహులు వినడం లేదు.
కల్యాణదుర్గంలో కత్తిమీద సామే
అధికారపార్టీలో టిక్కెట్ల కోసం ఆశావహులు ఎగబడటం సహజం. కానీ ఈసారి అనూహ్యంగా తెలుగుదేశం(TDP) పార్టీ టిక్కెట్ దక్కించుకునేందుకు నేతలు పోటీపడుతున్నారు. ఇన్నాళ్లు అధిష్టానం ఎవరి పేరు చెబితే వారికి సపోర్టు చేసుకుంటూ వచ్చిన పార్టీ కార్యకర్తలు సైతం ఈసారి రెండువర్గాలు చీలిపోవడం ఇబ్బందికర పరిస్థితే. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం(Kalyanadurgam)లో తెలుగుదేశం నేతల వర్గపోరుతో నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు రెండుగా చీలిపోయారు. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్న ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల వర్గపోరుతో కార్యకర్తలు ఎటు వెళ్లాలో తెలియక అయోమయ పరిస్థితిలో పడ్డారు. హనుమంతరాయ చౌదరి(Hanumathraya Chowdary), ఉమామహేశ్వర నాయుడు( Umamaheswara Naidu) ఇద్దరూ పార్టీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ టికెట్ తమదంటే తమదే అంటూ నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున హనుమంతరావు చౌదరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కుమారిడి పెత్తనంపై అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2019 ఎన్నికల్లో కొత్త అభ్యర్థిగా మాదినేని ఉమామహేశ్వరనాయుడిని పార్టీ రంగంలోకి దింపింది. అయితే హనుమంతరాయచౌదరి ఆ ఎన్నికల్లో సహకరించకపోవడం వల్లే ఓడిపోయామని ఉమామహేశ్వరనాయుడి వర్గం గుర్రుగా ఉంది.
చౌదరి వర్సెస్ నాయుడు
గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం ఓడిపోయినప్పటికీ ఇరువురు నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. పార్టీ కార్యక్రమాలను వేరువేరుగా జరపడంతో పాటు అధినేత చంద్రబాబు(CBN) పర్యటనలోనూ ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. మరోసారి ఎన్నికల రానున్న తరుణంలో వీరిరువురి మధ్య ఇదే కీచులాట కొనసాగితే....గెలుపు కష్టమేనని స్వయంగా తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటున్నారు. అటు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అధిష్టానం సైతం కల్యాణదుర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మంత్రి ఉషశ్రీచరణ్(Usha Sricharan) ను పెనుగొండకు మార్చి...కల్యాణదుర్గానికి అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను రంగంలోకి దింపి రేసులో ముందు నిలిచింది. అయితే ఇప్పటికీ తెలుగుదేశం అభ్యర్థి ఎవరన్న సందిగ్ధం వీడలేదు.
ఇంకా పొత్తుల సీటు ఖరారు కాకపోవడంతో జనసేన సైతం ఈ సీటు ఆశిస్తోంది. అయితే ఈసారి రంగంలోకి హనుమంతరాయచౌదరి కోడలు ఉన్నం వరలక్ష్మి దిగారు. ఆమె ఇప్పటికే గ్రామాల్లో పర్యటిస్తూ....ప్రచారం ప్రారంభించారు. ఆయన కుమారుడు మారుతి చౌదరి అసమ్మతి వర్గాన్ని బుచ్చగించే పనిలో ఉన్నారు. ఉమామహేశ్వరనాయుడు సైతం చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరిరువురూ ఇలాగే కొట్లాడుకుంటే...కొత్త అభ్యర్థిని తీసుకురావాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఆర్సీ కన్ స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబు(Surendra Babu) పేరు తెరమీదికి వచ్చింది. ఆర్థికంగా బలంగా ఉన్న సురేంద్రబాబుకు ఈసారి కళ్యాణదుర్గం టికెట్ ఇచ్చే ఆలోచలో పార్టీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.