Mobile Phones: చోరీ అయిన సెల్‌ఫోన్లను భారీగా పట్టేసిన పోలీసులు, ఇలా చేస్తే ఈజీగా ఫోన్ దొరుకుతుందట - పోలీసులు
AP news: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాట్ బాట్ యాప్ ద్వారా ఫోన్లను కనిపెట్టగలిగినట్లుగా అనంతపురం పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న CEIR పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని వివరించారు.
Mobile Phones Recover: ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోరీకి గురైన సెల్ ఫోన్లను అనంతపురం జిల్లా పోలీసులు భారీగా రికవరీ చేశారు. సుమారుగా జిల్లాలో ఇప్పటివరకు ఎనిమిది వందలకు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మీడియాకు వెల్లడించారు. వీటి విలువ సుమారుగా 15 కోట్ల రూపాయల పైనే ఉంటుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాట్ బాట్ యాప్ ద్వారా ఫోన్లను కనిపెట్టగలిగారు. చోరీకి గురైనా.. లేదా సెల్ ఫోన్లు ఎక్కడైనా మర్చిపోయి మిస్సయినా ఈ చాట్ బాట్ లో మొబైల్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను అప్లోడ్ చేస్తే పోలీసులు దాన్ని రికవరీ చేసే విధంగా ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారని పేర్కొన్నారు. చాట్ బాట్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న CEIR ద్వారా నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకున్న బాధితులకు సొంత రాష్ట్రంలోనే గాక ఇతర రాష్ట్రాల్లో కూడా పోయిన సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి ఇస్తున్నారు.
దీంతో జిల్లా పోలీసులను బాధితులు అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ జనావాసాల్లో తిరుగుతున్నప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రైల్వే స్టేషన్ బస్టాండ్ మార్కెట్ ఏరియాలలో దొంగలు ఎక్కువగా ఉంటారని తెలిపారు. అలాంటి సందర్భంలో అందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ దుకాణాల ద్వారా కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్ విక్రయించేటప్పుడు ఆ సెల్ ఫోన్ కి సంబంధించిన కంపెనీ బిల్ కచ్చితంగా ఉండాలని అలా లేనిపక్షంలో మొబైల్ ను విక్రయిస్తే వారు కూడా చట్టరీత్యా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటి వరకు చాట్ కార్యక్రమం ద్వారా 888 సెల్ ఫోన్ లను పోలీసులు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.15 కోట్లు పైన ఉంటుందని వెల్లడించారు. మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా వేసినట్లు తెలిపారు.
CEIR అంటే..
CEIR అనేది ఒక పోర్టల్. కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. దీని పూర్తి పేరు Central Equipment Identity Register. అందులో నమోదు చేసుకుంటే ఫోన్ పోయిన వెంటనే సిమ్ మార్చగానే, IMEI నంబర్ల ద్వారా ఫోన్ బ్లాక్ అవుతుంది. దీనివల్ల సదరు మొబైల్ నంబర్, మొబైల్ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండే వీలుంటుంది. ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు జవాబుదారీగా అందించేందుకు జిల్లా పోలీసులు బాగా పని చేశారని తెలిపారు. జిల్లా పోలీస్ సైబర్ విభాగం ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటున్నట్లు పేర్కొన్నారు.