Vangaveeti Radha Met Lokesh : లోకేశ్ యువగళం పాదయాత్రలో వంగవీటి రాధా, ఆ రూమర్లకు చెక్!
Vangaveeti Radha Met Lokesh : నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో వంగవీటి రాధా మెరిశారు. పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ కలిసిన ఆయన గంటకు పైగా భేటీ అయ్యారు.
Vangaveeti Radha Met Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనంతపురం జిల్లాలో పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. కలికిరి మండలం, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో నారా లోకేశ్ పాదయాత్రలో టీడీపీ నేత వంగవీటి రాధా పాల్గొన్నారు. భోజనం విరామ సమయంలో లోకేశ్ తో భేటీ అయిన వంగవీటి రాధా... అనంతరం లోకేశ్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేశ్ కాన్వాయ్ వాహనంలో గంటకుపైగా లోకేశ్ తో వంగవీటి రాధా చర్చలు జరిపారు. 37వ రోజు నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసేందుకు వంగవీటి రాధా మొగ్గుచూపిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే జనసేనలో చేరేందుకు కూడా రాధా సిద్ధపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన పొత్తు ఓకే అయితే విజయవాడ సెంట్రల్ సీటు సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో వంగవీటి రాధా లోకేశ్ పాదయాత్రలో పాల్గొనడంతో ప్రచారాలకు తెరపడ్డాయి. ఆయన టీడీపీలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విజయవాడ సెంట్రల్ టీడీపీ టికెట్ వంగవీటికి దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ముస్లిం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి
కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం వద్ద ముస్లిం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని లోకేశ్ ఆరోపించారు. వైసీపీ నేతలు వక్ఫ్ ఆస్తులు కబ్జా చేస్తున్నారని, కాపాడుకోవడానికి వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్ కల్పించాలన్నారు. ముస్లింలు అన్నీ విధాలా అభివృద్ది చెందేలా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రుణాలు అండదం లేదని, సంక్షేమ కార్యక్రమాలు అన్ని రద్దు చేశారని ఆరోపించారు. దుల్హన్ పథకానికి సవాలక్ష నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. గల్ఫ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదని ఆక్షేపించారు.
ఉపముఖ్యమంత్రి ఉండి కూడా ఉపయోగంలేదు
"బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఏనాడూ మైనార్టీ సోదరులపై దాడులు జరగలేదు. మైనార్టీలను ఇబ్బంది పెట్టలేదు. మైనార్టీల్లో పేదరికం ఉండకూడదు అనే లక్ష్యంతో టీడీపీ మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారు. ముస్లింలకు రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య లాంటి పథకాలు అమలు చేసింది టీడీపీ. మసీదులు, ఈద్గాల అభివృద్ధికి నిధులు కేటాయించింది టీడీపీ. షాదీఖానాలు ఏర్పాటు చేసింది టీడీపీ. ఖబర్ స్తాన్ లు అభివృద్ది చేసి మౌలిక వసతులు కల్పించాం. ఇమామ్ లు, మౌజామ్లకు గౌరవ వేతనం ఇచ్చాం. ఉర్దూ యునివర్సిటీ ఏర్పాటు చేశాం. హజ్ హౌస్ లు నిర్మాణం చేసింది టీడీపీ. హజ్ యాత్ర కు ప్రభుత్వం నుంచి సహాయం అందించింది కూడా టీడీపీనే. జగన్ ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని మోసం చేశారు. ఉప మఖ్యమంత్రిగా అంజాద్ బాషా ఉండి కూడా మైనార్టీలకు న్యాయం జరగలేదు. జగన్ రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య లాంటి పథకాలు రద్దు చేశారు. మసీదులు, ఈద్గాల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించడంలేదు"- నారా లోకేశ్