Anantapur News: వైద్యం వికటించి చిన్నారికి తీవ్ర అస్వస్థత, అధికారులు పట్టించుకోలేదని ఫ్యామిలీ ఆందోళన
Anantapur News in Telugu: ఓ హాస్పిటల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితి నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డాడు.
AP News in Telugu: అనంతపురం: ఓ హాస్పిటల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితి నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డాడు. వారి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ మండలం గుంటూరు గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు ప్రవీణ్ కుమార్ కు రెండు నెలల క్రితం కళ్ళు తిరిగి పడిపోవడంతో న్యూరోప్ సంబంధించిన వ్యాధి సోకిందని అతనిని నగరంలోని శశి న్యూరో కేర్ సెంటర్కు తరలించారు. అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి మందులను అందించారు.
మందులను ఒక వారం పాటు వాడిన తరువాత శరీరం మొత్తం పొక్కులు వచ్చాయి. దీంతో వారు ఆ చిన్నారితో నగరానికి చేరుకున్నారు. అతనికి శరీరానికి సంబంధించిన వ్యాధి సోకిందని తిరిగి ఫినితోయిన్ అనే మందును రాసిచ్చారు. దీంతో వారు గ్రామానికి వెళ్లి దానిని వేసుకున్న కొద్ది రోజుల్లోనే అతనికి తీవ్ర స్థాయిలో పొక్కులు వచ్చి నోటి నుంచి రక్తం కక్కుకున్నాడు. దీంతో భయాందోళన చెందిన వారి కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి గతంలో అందించిన వైద్య సేవలలో భాగంగా అందించిన మందులు వికటించడంతో ఈ ప్రమాదం ఏర్పడిందని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సకాలంలో ఇక్కడికి చేర్చడంతో ప్రాణం దక్కిందని వారి కుటుంబ సభ్యులకు అక్కడి వైద్యులు తెలియజేశారు. దీంతో 15 రోజుల తర్వాత నగరానికి చేరుకున్న వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద వారిని నిలదీశారు. అక్కడికి చేరుకున్న వివిధ వైద్యులు వారిని బుకాయించారు.
లక్షల్లో ఒకరికి ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని దీనిని పట్టించుకోరాదని నిర్లక్ష్యంగా సమాధానం అందించారు. ప్రమాదాలలో ఇతర కారణాలతో లక్షల మంది చనిపోతున్నారని వారిని ఎద్దేవా చేశారు. దీంతో వారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. సంబంధిత ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు వారు వెల్లడించారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున వారు డిమాండ్ చేశారు.
పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు
నగరంలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదించిన వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సమస్య తీవ్రమైన నేపథ్యంలో డెమో విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు జరిగిన అంశానికి సంబంధించి నివేదికలను తీసుకొని వెళ్ళినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఉన్నతాధికారికి వివరణ కోరగా చిన్నారి మృతి చెందలేదని పూర్తి నివేదిక వచ్చాక, విచారణ చేపడతామని ఆమె తెలిపారు.