Mid Day Meals : మధ్యాహ్న భోజనం తిని 82 మంది విద్యార్థులకు అస్వస్థత - అనంతపురం, నంద్యాలలో ఘటనలు
Anantapur Govt School : అనంతపురం పిల్లిగుండ్ల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
Anantapur Govt School : అనంతపురం పట్టణంలోని పిల్లిగుండ్ల కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత చిన్నారులు ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో వారిని తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది అనంతపురం సర్వజన ఆసుపత్రికి(Anantapur Govt General Hospital) తరలించారు. ఆస్పత్రిలో చిన్నారులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. చిన్నారులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని సొమ్మసిల్లి పడిపోతూ ఉండడంతో విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. ఆసుపత్రి వైద్య సిబ్బంది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సత్వరమే మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. విద్యార్థులకు ఎటువంటి హాని లేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు. చిన్నారుల అస్వస్థతకు కారణాలపై విచారించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారాన్ని తెలుసుకున్న అనంతపురం ఎంపీ రంగయ్య(MP Rangayya) ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
నంద్యాలలో 42 మంది విద్యార్థులకు అస్వస్థత
కర్నూలు జిల్లా నంద్యాల విశ్వనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(Primary School)లో మధ్యాహ్న భోజనం తిని 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పాఠశాలలో 92 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం(Mid Day Meal) చేశారు. వీరిలో కొంత మంది వెంటనే వాంతులు చేసుకుని స్పృహ తప్పిపడిపోయారు. పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు విద్యార్థులను గుర్తించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఈవో రంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని, అందరూ క్షేమమేనన్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. పాడైన గుడ్లు వడ్డించడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిసిందన్నారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో స్పష్టం చేశారు.
మంత్రి సురేష్ ఆరా
నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh) ఆరా తీశారు. డీఈవోతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలు తెలుసుకున్న మంత్రి విద్యార్థులకు అందించే ముందు ఆహార పదార్థాలు పరీక్షించాలని ఆదేశించారు. పిల్లలందరికీ పరీక్షలు చేసి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్యార్థులందరూ సురక్షితంగా ఇళ్లకు వెళ్లే వరకూ విద్యాశాఖ అధికారులు ఆసుపత్రిలో ఉండి పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.
Also Read : Vijayawada Mayor: ఫస్ట్ డే ప్రతీ షోకు 100 టికెట్లు పంపాలి-విజయవాడ మేయర్ లేఖ వైరల్