KA Paul : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనే సత్తా నా ఒక్కడికే ఉంది- కేఏ పాల్
KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనే స్థోమత తనకు మాత్రమే ఉందని కేఏ పాల్ స్పష్టం చేశారు.
KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తిరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకునే ప్రయత్నంలో తామే ఛాంపియన్స్ అని చెప్పుకొనేందుకు ట్రై చేస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ముందు దూకుడుగా వ్యవహరించిన బీఆర్ఎస్.. చివరకి చేతులెత్తేంది. సింగరేణి స్టీల్ ప్లాంట్ ఈవోఐ బిడ్డింగ్ పాల్గొనలేదు. తాజాగా స్టీల్ ప్లాంట్ విషయంలో మరో ఇద్దరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారిలో ఒకరు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కాగా, మరొకరు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. వీరద్దరూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకూ తెలంగాణ సుడిగాలి పర్యటనలు చేసి కేఏ పాల్... ఇప్పుడు ఏపీ షిఫ్ట్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ పై ఫోకస్ పెట్టిన కేఏ పాల్... కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించిన కేఏ పాల్.. స్టీల్ ప్లాంట్ కొనే స్థోమత తనకు మాత్రమే ఉందన్నారు. అన్ని పార్టీలు కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేద్దామని పిలుపునిచ్చారు.
చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఫెయిల్
నర్సీపట్నంలో ఉన్న తన తండ్రిని చూసేందుకు వచ్చిన కేఏ పాల్... మార్గమధ్యలో మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనే స్థోమత తన ఒక్కడికే ఉందన్నారు కేఏ పాల్. ఏడాదిగా కమిటీలను లెటర్ ఇమ్మని డిమాండ్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ సీఎంలుగా ఫెయిలయ్యారన్నారు. తనను సీఎం చేస్తే రాజధాని అమరావతిని పూర్తి చేస్తానన్నారు. సింగరేణిని కాపాడుకోలేని సీఎం కేసీఆర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా కొనగలరని? ప్రశ్నించారు. రూ.45 వేల కోట్ల విదేశీ నిధులు తెచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటానని కేఏ పాల్ చెప్పారు.
కుటుంబ, కుల పాలన మనకు వద్దు
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు కోసం తాను రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటిసారిగా తానే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశానని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం, ఆఖరికి స్టీల్ ప్లాంటు పోరాట సంఘాలు రాకపోయినా పోరాడానని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం మోదీని, అమిత్ షాని, ఉక్కు శాఖ మంత్రిని పదీ పదిహేను సార్లు కలిశానని అన్నారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయొద్దని కోరానని చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ లేఖ రాశారని, ఆ లేఖలు కుక్కలైనా పట్టించుకుంటాయా అని ఎద్దేవా చేశారు. ‘‘పవన్ కల్యాణ్ నిరాహార దీక్ష చేశాడట. స్టీల్ ప్లాంట్ దగ్గర నేను టెన్త్, ఇంటర్ పరీక్షల కోసం నేను నిరాహార దీక్ష చేశాను. ప్రభుత్వం, చంద్రబాబు పట్టించుకున్నారా? కేసులకు భయపడి వారు ముందుకే రాలేదు’’ అని వ్యాఖ్యానించారు. రూ.42 వేల కోట్లు డొనేషన్ ఇస్తానని రాతపూర్వకంగా నేను హామీ ఇచ్చాను. మోదీ, అమిత్ షాని, స్టీల్ మినిస్టర్ ని కలిసి ప్రైవేటీకరణ చేయొద్దని కోరా. రాష్ట్రంలో దొంగల మాటలకు మనకు వద్దు’’ అని అన్నారు. చంద్రబాబుకు 14 ఏళ్లు, కేసీఆర్‌కు 9 ఏళ్లు, జగన్‌కు ఐదేళ్లు అధికారం ఇచ్చారని, తనకు కూడా అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. కుటుంబ, కుల పాలన మనకు వద్దని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల పాలన మనకు కావాల్సిన అవసరం ఉందని అన్నారు.