Duvvada Srinivas : స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజంతో గెలిచాం - టెక్కలి వైసీపీ అభ్యర్థి చెప్పిన విన్నింగ్ ఫార్ములా వైరల్
Andhra Politics : టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన విధానం వివరించిన ఆడియో టేప్ వైరల్ అయింది. రౌడీయిజంతో గెలిచానని ఆయన అందులో చెబుతున్నారు.
Duvvada Srinivas audio tape gone viral : టెక్కలి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నోటి దురుసు విమర్శలతో తరచూ వివాదాల పాలవుతూంటారు. తాజాగా ఆయన మరోసారి అలాంటి కామెంట్లు చేసినట్లుగా ఉన్న ఆడియో టేప్ వైరల్ అయింది. రౌడీయిజం చేసి మరీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికం గెలిచామని ఆయన చెప్పుకుంటున్నారు.
లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎలా బరితెగించారో చెబుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ..#WhyAPHatesJagan .. #YCPCriminalPolitics pic.twitter.com/SSu7wa9NN9
— CSreenivas14 (@Sreenivas14C) February 17, 2024
స్థానిక సంస్థల్లో గెలుపు కోసం రౌడీయిజం
దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నట్లుగా ఉన్న ఆడియో టేపులో స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలోని 55 సర్పంచి స్థానాల్లోనే వైసీపీ మద్దతుదారులు గెలుస్తారని తేలిందన్నారు. మిగిలినవన్నీ టీడీపీ సొంతం చేసుకుంటుందని .. ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం.. ఎలా చేద్దామని ఆలోచించామన్నారు. నిమ్మాడలో మాకు మద్దతిచ్చే కింజరాపు అప్పన్న సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా టీడీపీ వాళ్లు ఇబ్బంది పెట్టారని.. ఆ సాకుతో నేను ఆ ఊరిపై దాడి చేసి ఆయనతో నామినేషన్ వేయించానని ఆడియో దువ్వాడ శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. అదే్ సమయంలో తనను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కొట్టారని చెప్పి ఆయన్ని జైల్లో పెట్టించి వారి కార్యకర్తలు వీధుల్లోకి రాకుండా చేశామన్నారు.
జడ్పీటీసీ అభ్యర్థులందర్నీ బంధించాం !
బయటకొస్తే మీ అంతు చూస్తామని సంతబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పుక్కళ్ల శ్రీనివాసరావును హెచ్చరించి ఆయనపై రౌడీషీట్ తెరిపించి అరెస్టు చేయించామని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. కోటబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ భర్త సత్యం ఇంటి తలుపులు వేసి బంధించామని.. టెక్కలి, నందిగాంలలో జడ్పీటీసీ అభ్యర్థులను బయటకు రాకుండా చేశామన్నారు. నాలుగు చొప్పున ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు, 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు గెలిచామన్నారు. అచ్చెన్నాయుడిని లోపల వేయడం, ఆ పార్టీ క్యాడర్‌ను భయపెట్టడం.. ఇలా రౌడీయిజమే చేశామని ఆయన వివరిచారు.
ఆడియో వైరల్ కావడంతో కలకలం
అనుచరుల వద్ద ఆయన చేసిన వ్యాఖ్యలంటూ బయటకు రావడంతో అవి చర్చనీయాంశమవుతున్నాయి. సర్పంచి ఎన్నికల సమయంలో డు అచ్చెన్నాయుడి స్వగ్రామం నిమ్మాడలో చోటుచేసుకున్న సంఘటనలు, అందుకు దారితీసిన పరిస్థితులు, హత్యాయత్నం కేసులో అచ్చెన్నాయుడి అరెస్టు, అనంతర పరిణామాలను ఎమ్మెల్సీ ప్రస్తావించినట్లు ఉండటం సంచలనంగా మారింది. జరిగిన పరిణామాలన్నీ అంతే ఉన్నాయి. రౌడీయిజం చేసి గెలిచామని అప్పట్లో ఆయన చేశారంటున్న వ్యాఖ్యలు తాజాగా బయటకు రావడం కలకలం రేపింది. వచ్చే ఎన్నికల్లోనూ అదే చేస్తారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.