YSRCP News: నేడు వైసీపీ కీలక సమావేశం, ఎన్నికలకు ముందు ఇదే ఆఖరు - సజ్జల
Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇది ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం అని అన్నారు.
Mangalagiri News: మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ లో మంగళవారం (ఫిబ్రవరి 27న) వైఎస్ఆర్ సీపీ కీలక సమావేశం జరగనుంది. సమావేశం ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి వైసీపీ ఇంఛార్జి గంజి చిరంజీవి తదితరులు పర్యవేక్షించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇది ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం అని అన్నారు. క్షేత్రస్థాయి, మండల కార్యకర్తలతో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు ఇందులో పాల్గొంటారని అన్నారు.
ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సీఎం జగన్ దిశానిర్ధేశం చేస్తారు. ప్రత్యర్థులు అవకతవకలకు పాల్పడకుండా ఎలా చూడాలో చెప్తారు. ప్రజల్లోకి మరింతగా పార్టీని ఎలా తీసుకెళ్లాలో వివరిస్తారు. వైసీపీ ఎప్పుడూ ప్రజల్లోనే ఉంది. నాయకులెప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని.. పథకాలను ప్రజలకు చేరవేస్తూనే ఉన్నాం. నాలుగున్నరేళ్లుగా ప్రజల అవసరాలను తెలుసుకుని తీరుస్తున్నాం. ఎన్నికలకు అందరికంటే ముందే పోటీలోకి దిగే గట్టి టీమ్ ను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాం. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పూర్తి చేశాం. బూత్ కమిటీలు కూడా రెడీ చేస్తున్నాం. సమర్థవంతమైన బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక ఓరియంటేషన్ ప్రక్రియ రేపు జరగనుంది.
నేటి సమావేశం తర్వాత మేం పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతాం. మా అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తున్నప్పుడు ఏదో అయిపోతుందని మమ్మల్ని విమర్శించారు. మేం ఆరోజే చెప్పాం.. మీది మొదలుకాబోతోందని. అసంతృప్తులెవరైనా ఉంటే పిలిచి మాట్లాడుతున్నాం.. అంతా సర్దుకున్నారు. టీడీపీ, జనసేన సీట్ల సర్ధుబాటు అతుకుల బొంత. పవన్ ను ఘోరంగా అవమానించి 24 సీట్లు కేటాయించారు. గంపగుత్తగా వస్తున్నారని మేం ఎవరిని పడితే వారిని చేర్చుకోం. అలాంటి వారి వల్ల అనవసరమైన తలనొప్పులు పార్టీకి భారం’’ అని సజ్జల అన్నారు.