YSR Awards 2022: వైఎస్సార్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వనించిన ఏపీ సర్కార్, లాస్ట్ డేట్ ఎప్పుడంటే
వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాలు, అచీవ్‌మెంట్ అవార్డులు-2022 దరఖాస్తులకు ఆహ్వనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం“వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ – 2022” అత్యున్నత పురస్కారాలు అందించనుంది. ఇందుకోసం వివిధ రంగాలు, విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు లేదా సంస్థల నుండి ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా రెండవ ఏడాది అవార్డుల ఎంపికకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి హై పవర్ స్క్రీనింగ్ కమిటీ విజయవాడలో సమావేశం అయింది.
అవార్డ్ ఎంపికల కమిటీ సభ్యులు వీరే..
ఈ కమిటీలో సభ్యులుగా జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడి కృష్ణమోహన్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ రేవు ముత్యాలరాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ రాజారత్నం, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, పౌరసరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ఉప కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం రెడ్డి ఉన్నారన్నారు.
అసామాన్య కృషి చేసిన వారికే అవార్డులు
సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ రంగాలలో అసాధారణ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు కలిగి.. సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేసిన వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు అందించే విషయంలో పెద్దపీట వేయాలని కమిటీ నిర్ణయించిందన్నారు. సామాజిక అభ్యున్నతి కోసం అసామాన్య కృషి చేసిన వారికే అవార్డులు అందిస్తామని తెలపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత భారతరత్న, పద్మశ్రీ తదితర పురస్కారాల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలు అందిస్తోందని చెప్పారు.
దరఖాస్తులకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం
అవార్డు ఎంపిక కోసం విద్య, వైద్య, వ్యవసాయ, మహిళాభ్యుదయం, సామాజిక న్యాయం, దేశ, విదేశాల్లో గుర్తింపు పొందిన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక తదితర రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు మరియు సంస్థల ఔత్సాహికుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, వారి బయోడేటాను secy-political@ap.gov.in మెయిల్ ఐడీకి పంపించాలని ఆయన తెలిపారు. అర్హులైన సంస్థలు, వ్యక్తులను గుర్తించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వ్యక్తులను, సంస్థలను హైపవర్ స్క్రీనింగ్ కమిటీ అవార్డుకు ఎంపిక చేస్తుందన్నారు.
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీతకు రూ.10 లక్షలు
గతేడాది నవంబర్ 1, 2021న కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించి సమాజాన్ని ప్రభావితం చేసిన 59 మంది ప్రముఖ వ్యక్తులు, సంస్థలను వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులతో సత్కరించినట్లు చెప్పారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ క్రింద 10 లక్షల నగదు బహుమతి, వైఎస్ఆర్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తారని చెప్పారు. వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారని తెలిపారు. సామాజిక అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు పురస్కారాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.