YS Jagan: "రాళ్లు లేకుండా భూసర్వే ఎలా పూర్తి అవుతుంది, సర్వే అంటేనే చంద్రబాబుకు తెలియదు" వైసీపీ అధినేత జగన్ విమర్శలు
YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబుకు భూసర్వే అంటేనే తెలియదని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. కానీ తాము నిర్వహించిన రీ సర్వే క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు.

YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. భూమండలంపై క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఆయన్ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అన్నారు. అంతటి దారుణమైన మోసాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు తీర్చాలనే ఆలోచన లేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. భూముల రీ సర్వే చేయాలన్న ఆలోచన ఎప్పుడూ చేయని బాబు ఇప్పుడు దాని విషయంలో అదే పని చేస్తున్నారని అన్నారు.
రీ సర్వే ఆలోచన తనకు పాదయాత్రలో వచ్చిందని చెప్పారు జగన్. రైతుల తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు రీ సర్వే ఆలోచన వచ్చిందన్నారు. తాము అధికారంలోకి రాక ముందు సర్వేయర్లు లేరని, భూములు సర్వే చేసే టెక్నాలజీ కూడా లేదని గుర్తు చేశారు. సవాలక్ష భూ సమస్యలను పరిష్కారం చేయడమే లక్ష్యంగా రీసర్వే చేపట్టామని తెలిపారు.
అంతకు ముందు సమస్య వచ్చిన ప్రతి భూమిని 22Aలో పెట్టడమే చంద్రబాబు చేశారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి పరిష్కారం చూపామని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర భూ సర్వే చేయిస్తామని 2019లో మేనిఫెస్టోలో పెట్టామని జగన్ గుర్తు చేశారు. చెప్పినట్టుగానే 2020 డిసెంబర్ 21న భూ రీ సర్వే ప్రారంభించామని తెలిపారు. దాన్ని మహా యజ్ఞంలా చేపట్టామని వివరించారు. రికార్డులు ట్యాంపర్ చేయలేని విధంగా సంస్కరించామని వివరించారు. భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వం పూచీకత్తుగా పత్రాలు రైతులకు అందజేసినట్టు తెలిపారు. ఆధునిక ఫీచర్స్‌తో రైతులకు పాస్‌బుక్స్ ఇచ్చామని అందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని దానిలో అన్ని వివరాలు పొందుపరిచామని వివరించారు. నాలుగుసార్లు సీఎంగా ఉండి, 80 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబుకు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా అని జగన్ ప్రశ్నించారు. ఇలా చేసిన ప్రతి ఒక్కటి రికార్డేనని అన్నారు.
ఇప్పుడు మాత్రం తానే మొత్తం చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. అసలు సర్వే రాళ్లు లేకుండా సర్వే పూర్తి అయిందని ఎలా చెబుతారని జగన్ ప్రశ్నించారు. తమ హయాంలో ప్రభుత్వమే సర్వే రాళ్లను ఉచితంగా సరఫరా చేసిందని అన్నారు. ప్రత్యేకమైన ముద్రతో వాటిని సర్వే పూర్తి అయిన ప్రాంతాల్లో పాతినట్టు పేర్కొన్నారు. ఏ రాళ్లు పడితే అవి పెట్టుకుంటూ పోతే కథ మళ్లీ మొదటికి వస్తుందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబుకు సర్వే అంటేనే అవగాహన లేదని అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.
గతంలోనే భూముల రీ సర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించిందని జగన్ గుర్తు చేశారు. సర్వేకు కేంద్రం తమ ప్రభుత్వానికి ప్లాటినమ్ గ్రేడ్ ఇచ్చిందని తెలిపారు. కేరళ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర అధికారులు వచ్చి అధ్యయనం చేశారని తెలిపారు. అసోం తమ సహకారం కోరిందని వెల్లడించారు. సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ తాము చేసిన సర్వేను మెచ్చుకున్నారని వీడియో ప్లే చేశారు. ఇంతటి గొప్ప యజ్ఞంపై చంద్రబాబు ఆయన మీడియా విషం చిమ్మిందని అన్నారు. ఎన్నికల్లో దీన్నే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐవీఆర్ కాల్స్, ప్రకటనల ద్వారా జగన్ గెలిస్తే మీ భూమి మీకు దక్కదని దుష్ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడు నిజాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు యూ టర్న్ తీసుకొని సర్వే అమలు చేస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా ఆ క్రెడిట్ కూడా చోరీ చేస్తున్నారని మండిపడ్డారు.
Before You Go
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
ట్రెండింగ్ వార్తలు





















