ఇప్పటంలో ఎమ్మెల్యే ఆర్కే పర్యటన-ఇప్పటికి గుర్తొచ్చామా అంటున్న స్థానికులు
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఇప్పటంలో రూ.13 కోట్లతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేసినట్టు తెలిపారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.
ఇప్పటం వ్యవహరం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రాజకీయంగా ఇప్పటం గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటి వరకు అధికార పార్టీకి చెందిన నేతలు ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పటంలో పర్యటించారు.
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఇప్పటంలో రూ.13 కోట్లతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేసినట్టు తెలిపారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన ఇప్పటంలో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయాంలో అప్పటి మంత్రి హనుమంతరావు చేతులు మీదుగా కళ్యాణ మండపాన్ని ప్రారంభించామన్నారు. ఇప్పుడు ఆ కళ్యాణ మండపాన్ని సుమారు రూ.80లక్షల వ్యయంతో పూర్తిస్థాయి హంగులతో తీర్చిదిద్దామని తెలిపారు. ఇప్పటంతోపాటు పరిసర ప్రాంతాలైన వడ్డేశ్వరం, గుండిమెడ,కొలను కొండ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లల్లో జరిగే శుభ కార్యాలను పూర్తి స్థాయిలో అతి తక్కువ ఖర్చుతో నిర్వహించుకునే అవకాశం కల్పించామని వివరించారు. కార్పోరేషన్‌గా మారిన తర్వాత శుభ కార్యాల కోసం కళ్యాణ మండపాలకు లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి వస్తోంది. అందుకే నగరపాలక సంస్థ నిధులతో చేపట్టిన కళ్యాణ మండపంలో తక్కువ ఖర్చుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు శుభకార్యాలు నిర్వహించుకోవచ్చునన్నారు ఆర్కే. త్వరలోనే కళ్యాణ మండపాన్ని ప్రారంభిస్తామన్నారు.
కళ్యాణ మండపంతోపాటు వంగవీటి మోహన రంగా, గౌతు లచ్చన్న, చాకలి ఐలమ్మ పేర్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న అదే ఆవరణలోని భవనాలను ప్రారంభించనున్నారు. ఇప్పటంలో జగనన్న కాలనీలో నూటికి నూరుశాతం ఇళ్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయని, ప్రస్తుతం గ్రావెల్ రోడ్లు, సిమెంటు రోడ్లు, సిమెంటు డ్రైనేజిల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ చేపట్టినట్టు వెల్లడించారు. త్వరలోనే పనులు ప్రారంభించి కాలనీ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి.
రాజకీయాలకు సంచలనంగా మారిన ఇప్పటం...
ఇప్పటం గ్రామం రాజకీయాలకు సంచలనంగా మారింది. జనసేన పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఇప్పటం గ్రామస్తులు 14ఎకరాల స్దలాన్ని కేటాయించారు. ఆ తరువాత ఈ వ్యవహరం తీవ్ర రాజకీయ దుమారానికి కేంద్రం అయ్యింది. ఇప్పటం గ్రామంలో ఆక్రమణల పేరుతో నిర్మాణాలను తొలగించడం వివాదానికి దారి తీసింది. జనసేన పార్టీ సభకు స్థలం ఇచ్చామనే అక్కసుతోనే అధికార పార్టీ తమ ఇళ్ళ ముందు ఉన్న నిర్మాణాలను తొలగించిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణాలు కూల్చిన 24గంటలు గడవక ముందే జనసేన పార్టీ అధినేత పవన్ ఇప్పటంలో పర్యటించి బాదితులకు మద్దతు ప్రకటించారు. ప్రతి ఇంటికి లక్ష రూపాయలు సాయం అందించారు. దీంతో ఈ వ్యవహరం మరింత సంచలనంగా మారింది. అంతకు ముందే పవన్ పార్టీ సభకు స్దలం ఇచ్చిన గ్రామానికి ధన్యవాదాలు చెబుతూ గ్రామ సంక్షేమ పనుల కోసం 50లక్షలు ఇస్తానని ప్రకటించారు. రెండోవిడతగా ఇళ్ళ నిర్మాణాల తొలగింపులో నష్టపోయిన 53మంది బాదితులకు 53లక్షలు పవన్ ఇచ్చారు.
అప్పటి నుంచి కనిపించని ఎమ్మెల్యే..
ఇప్పటం గ్రామం సంచలనంగా మారినా రాజకీయ నాయకులు అంతా గ్రామంలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాత్రం గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతే కాదు బాధితులతో కనీసం ఫోన్‌లో కూడా ఎమ్మెల్యే మాట్లాడలేదు. అయితే ఇప్పుడు వాతావరణం అంతా ప్రశాంతంగా మారటంతో ఇప్పటం గ్రామంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పర్యటించారు. అయితే గ్రామస్దులు మాత్రం ఇన్నాళ్ళకు మా గ్రామం గుర్తుకు వచ్చిందా అంటూ ఎమ్మెల్యే ముందే నవ్వుతూ మాట్లాడటంతో, రామకృష్ణారెడ్డి కూడ నవ్వుతూ ముందుకు వెళ్లారు.