మొన్న టౌన్ ప్లానింగ్, ఇప్పుడు హోర్డింగ్‌లు- గుంటూరు కార్పొరేషన్‌లో రగడ !
గుంటూరు నగరపాలక సంస్థలోని ప్రణాళిక విభాగంలో ప్రకటన బోర్డుల నిర్వహణ, ఫీజుల వసూళ్లలో జరుగున్న అవినీతిపై చర్చకు వచ్చింది. వైసీపీ చేసిన ఈ ఆరోపణలతో ఒక్కసారిగా రగడ మొదలైంది.
గుంటూరు కార్పోరేషన్‌లో అధికారులుపై అధికార పక్షం నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న టౌన్‌ప్లానింగ్‌లో అక్రమాలు అంటూ విరుచుకుపడిన నేతలు ఇప్పడు ప్రకటనల హోర్డింగ్‌ల ఏర్పాటులో అవినీతిపై నిలదీయటం కలకలం రేపింది.
కౌన్సిల్ సమావేశంలోనే రగడ
గుంటూరు నగరపాలక సంస్థలోని ప్రణాళిక విభాగంలో ప్రకటన బోర్డుల నిర్వహణ, ఫీజుల వసూళ్లలో జరుగున్న అవినీతిపై చర్చకు వచ్చింది. కొన్నేళ్లుగా ప్రకటనల హోర్డింగ్స్ ఏర్పాటు, వాటి నుంచి వచ్చే అద్దెల్లో వ్యత్యాసం ఉంటుందని వైసీపీ ఆరోపించింది. అధికారుల అవినీతి బయటకు రానీయకుండా జాగ్రత్తలు పడుతున్నారంటూ వైసీపీ కార్పోరేటర్లు అధికారిక సమావేశంలోనే ప్రస్తావించారు. కోట్లలో అవినీతి జరుగుతోందని, పాలకవర్గం వచ్చిన తరువాత కూడా అవినీతికి అడ్డు లేకుండాపోయిందని వైసీపీకి చెందిన కార్పొరేటర్లు షేక్ రోషన్, అచ్చాల వెంకట రెడ్డి, వెంకటకృష్ణ ఆచారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరర పాలక సంస్థ అధికారిక సమావేశంలోనే ఈ అంశం ప్రస్తావనకు రావటంతో మేయర్‌సహా మున్సిపల్ కమిషనర్ కూడా ఖంగుతినాల్సి వచ్చింది. ప్రకటన బోర్డుల అవినీతిపై గతంలోనే పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో చర్చించినప్పటికి అధికారుల తీరులో మార్పు లేదని కార్పోరేటర్లు ఫైర్ అయ్యారు. భవానీ యాడ్స్ అనే సంస్థకు చెందిన వ్యక్తులు మరికొన్ని డమ్మీ సంస్థలను ఏర్పాటు చేసి, పట్టణ ప్రణాళిక అధికారులతో కుమ్మక్కై దందా సాగిస్తున్నారని ఆరోపించారు. నగరంలో 75 శాతం వరకు ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నారంటూ కార్పోరేటర్లు కామెంట్ చేశారు. ప్రకటనల ద్వారా లక్షలు ఆర్జిస్తున్న వ్యక్తి ఒకరు జీఎంసీకి చెల్లింపులు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఇందులో అధికారుల భాగస్వామ్యం లేకుండా జరుగుతుందని తాము అనుకోవటం లేదని వ్యాఖ్యానించారు.
అధికారులు వివరణ ఏంటంటే ?
ఈ వ్యవహరంపై గుంటూరు నగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారి మూర్తి, డీసీపీ కోటయ్య వివరణ ఇచ్చారు. నగరంలో బోర్డులు, హోర్డింగ్స్ తదితర వాటి గురించి వివరాలను కౌన్సిల్ ముందు ఉంచారు. అయితే అధికారుల లెక్కలపై కార్పోరేటర్లు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తమ తీరు మార్చుకోవాలని, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు డిమాండు చేశారు. గడప గడప' కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్తుంటే స్థానిక సమస్యలపై నిలదీస్తున్నారని పలువురు కార్పొరేటర్లతోపాటు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కూడా తమ ఆవేదన వెలిబుచ్చారు. ప్రజలు చిన్న చిన్న పనులు చేయించాలని అడుతున్నారని, వాటిని కూడా పూర్తి చేయించలేని పరిస్థితుల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లతామని వ్యాఖ్యానించారు.
గతంలో కూడా టౌన్ ప్లానింగ్‌లో అవినీతి...
గత సమావేశంలో కూడా టౌన్ ప్లానింగ్‌లో అవినీతి వ్యవహరాలపై నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలోనే వైసీపీ కార్పోరేటర్లే స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహరంపై అధికారులు తాత్కాలికంగా వివరణ ఇచ్చినప్పటికి ఆ తరువాత కూడా అదే తంతు కొనసాగుతుందని కార్పోరేటర్లు గుర్రుగా ఉన్నారు. గుంటూరు కార్పోరేషన్ పరిధిలో ఇళ్ళ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే విషయంలో జరుగుతున్న అవినీతిపై వైసీపీ కార్పోరేటర్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా అదే టౌన్ ప్లానింగ్‌లో ప్రకటనల హోర్డింగ్‌ల రూపంలో అవినీతి ఆరోపణలు రావటం, అది కూడా వైసీపీ కార్పోరేటర్లే ప్రస్తావించటంపై చర్చ జరుగుతుంది.