KCR Statement: సీఎం జగన్‌ను ఇరుకున పెట్టిన కేసీఆర్, ఏపీ ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి
తెలంగాణలో ఉద్యోగాల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు గుర్తు చేస్తున్నాయి ప్రతిపక్షాలు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఒక్కసారిగా 91వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో నేరుగా 80వేలకుపైగా పోస్టులు నేరుగా భర్తీ చేస్టున్నట్టటు వెల్లడించారాయన. కాంట్రాక్ట్ పోస్టులను కూడా రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఇంత వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. సచివాలయాల పోస్టులను భర్తీ చేసినప్పటికీ అవి రెగ్యులర్ పోస్టులు కావని అంటున్నారు. వాలంటీర్లను కూడా ప్రభుత్వం ఉద్యోగాలుగా ప్రచారం చేస్తోందని తెలుగు దేశం విమర్శిస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారని ఇప్పుడు వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా డీఎస్సీ తీస్తామన్నారని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. కానీ అవేవీ ఇప్పుడు అమలుకు నోచుకోవడం లేదని విమర్శిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేస్తామన్నారని గుర్తు చేస్తోంది టీడీపీ.
నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మోసగించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. కాంట్రాక్టు ఉద్యోగుల్ని వెంటనే రెగ్యులరైజ్ చేసి ఖాళీలను భర్తీ చేయాలంటూ నినాదాలు చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది.
ఈ ర్యాలీ సందర్భంగా టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో తెలంగాణను చూసైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యగా నిరుద్యోగం ఉందని తెలిపారు. నిరుద్యోగం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసాగించారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో 90 వేల పోస్టులు భర్తీ చేస్తే ఏపీలో ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు.
నిరుద్యోగుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని వ్యాఖ్యలు చేశారు బుచ్చయ్య చౌదరి. పదవీ విరమణ చేసిన వారి పోస్టులు కూడా భర్తీ చేయట్లేదని మండిపడ్డారు. గుడ్డి ప్రభుత్వం వల్ల నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని తెలిపారు. ఆదాయం పెరిగిందంటున్న ప్రభుత్వం... ఉద్యోగాల భర్తీ ఎందుకు చేపట్టట్లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు క్షీరాభిషేకాలు కూడా చేశారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మహేష్ కేసీఆర్‌ను అభినందించారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం 2,32,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.