CM JAGANMOHAN REDDY : తాడేపల్లి కాలనీని కూల్చివేత వెనుక "ఆ" ప్లాన్..!?
నిన్న మొన్నటి వరకు ఆ కాలనీ గురించి ఎవరికీ తెలియదు. కానీ కూల్చివేతలతో హాట్‌టాపిక్‌గా మరింది. ఇంతకీ ఆ కాలనీ చుట్టూ రగులుతున్న రాజకీయం ఏంటి?
అమరారెడ్డి నగర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి సమీపంలో ఉన్న ఈ కాలనీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా అక్కడి కాలనీని కూల్చివేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ సెక్యూరిటీకి ఇబ్బంది అని అక్కడ ఖాళీ చేయిస్తున్నారు. ఈ వ్యవహారంలో వాలంటీర్‌గా పని చేస్తున్న శివశ్రీ అనే యువతి.. కూల్చివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం... ఆమె ఇంటిని కూడా రాత్రికి రాత్రే కూల్చివేయడం... అటు ప్రజల మధ్య నేరుగానే కాకుండా... సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశం అవుతోంది. అసలు జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్లాలనుకుంటున్నారు... అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఖాళీ చేయిస్తున్నారనేది ... చాలా మందికి వస్తున్న సందేహం.
మూడు రాజధానులే లక్ష్యంగా సీఎం జగన్.. పని చేస్తున్నారు. విశాఖకు ఏ క్షణమైనా వెళ్లి.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించాలని అనుకుంటున్నారు. ఏ క్షణమైనా విశాఖకు అంటూ తరచూ మంత్రులు.. ఎంపీలు ప్రకటనలు చేస్తున్నారు. రాజధాని అంశం కోర్టులో ఉంది. కోర్టు తీర్పు తేలే వరకూ ఉండాల్సిన అవసరం లేదని సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని కాబట్టి.. జగన్ కూడా.. క్యాంపాఫీసు చూసుకుని విశాఖ వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. రాజధాని తరలింపు అని సాంకేతికంగా చెప్పకపోయినా... సీఎం మాత్రం తాడేపల్లిలో ఉండదల్చుకోలేదు. దీనిపై స్పష్టత ఉంది. విశాఖలో ఇప్పటికే జగన్ కోసం చాలా నివాసాలు రెడీ అయ్యాయి. కొండల మీద నుంచి బీచ్ కనిపించేలా ఆహ్లాదంగా ఉండే ఓ రిసార్ట్... ప్రధానంగా జగన్ నివాసంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అలాగే గ్రేహౌండ్స్ స్థలంలో స్టేట్ గెస్ట్ హౌస్ కడుతున్నారు. పేరుకు అది స్టేట్ గెస్ట్ హౌసే కానీ.. జగన్ నివాసం అని అందరూ చెప్పుకుంటున్నారు.
తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ ఇల్లు.. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అభివృద్ధి చేసిన లే ఔట్‌లో రెండు ఎకరాల స్థలంలో ఉంటుంది. మిగిలిన స్థలంలో విల్లాల్లాంటి నిర్మాణాలు కట్టారు. ఒక్క సీఎం జగన్‌కు మాత్రం... రెండు ఎకరాల స్థలంలో ఇల్లు ఉంది. ఆ ఇల్లు తాడేపల్లి కాలువకట్టకు దగ్గరగా ఉంటుంది. కాలువ కట్ట మీద ముఫ్పై ఏళ్లుగా అమరారెడ్డి నగర్ అనే కాలనీలో నిరుపేదలు ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఇప్పుడు అక్కడ జగన్ ఇల్లు కట్టుకోవడం వారికి శాపంగా మారింది. జగన్ క్యాంప్ ఆఫీస్ అక్కడ ఉన్నప్పటి నుండి ఆ కాలనీని ఖాళీచేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. బయట ఎక్కడైనా ఇళ్లు నిర్మించి అక్కడికి పొమ్మంటే వెళ్లేవారేమో కానీ.. ముందు ఖాళీ చేసి వెళ్లిపోతే తర్వాత ఇళ్లిస్తామని చెబుతూండటంతో అక్కడి పేదలు విలవిల్లాడిపోతున్నారు. భయంతో చాలా మంది వెళ్లిపోయారు. అసలు జగన్ తాడేపల్లిలోనే ఉండదల్చుకోలేనప్పుడు.. ఎందుకు కాలనీని ఖాళీ చేయించేశారనేది ఎక్కువ మందికి వస్తున్న సందేహం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడిక్కడ ఇళ్లు నిర్మించుకుంటున్నారు కానీ అందులో ఉండలేకపోతున్నారు. ఇడుపులపాయ ఎస్టేట్‌లో మంచి ఇల్లు ఉంది. ఆ తర్వాత పులివెందులలో ఇల్లు ఉంది. కడపలో ఇల్లు ఉంది. బెంగళూరు శివార్లలో యలహంకలో ప్యాలెస్ ఉంది. హైదరాబాద్ లోటస్ పాండ్, తాడేపల్లిలో మరో ప్యాలెస్ ఉంది. కానీ ఆయన ఎక్కడా ఉండలేకపోతున్నారు. త్వరలో విశాఖకు వెళ్లబోతున్నారు. అక్కడ కూడా ఆయన ఓ ఇల్లు కట్టుకుంటారు. కానీ ఇప్పటి వరకూ ట్రెండ్ చూస్తే ఆయన స్థిరంగా ఉండలేకపోతున్నారు. అక్కడా ఉండటం డౌటే కావొచ్చు. కానీ.. తాడేపల్లిలో ఆయన ఇల్లు కట్టుకోవడమే.. అమరారెడ్డి నగర్ వాసులకు శాపంగా మారింది.