Amaravati Municipality: అమరావతి గ్రామసభలో ఒక్కరు తప్ప అంతా వ్యతిరేకం
Amaravati Municipality: అమరావతిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను గ్రామస్థులు తిరస్కరించారు. ఒక్కరు తప్ప గ్రామస్థులంతా వ్యతిరేకించారు.
Amaravati Municipality: అమరావతిని పురపాలికగా ఏర్పాటు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మొదట్లోనే గట్టి షాక్ తగిలింది. మున్సిపాలిటీగా మార్చేందుకు గ్రామస్థుల నుండి అభిప్రాయం తీసుకునేందుకు గ్రామ సభ నిర్వహించగా.. గ్రామస్థులు అంతా కలిసి ఒకే మాట చెప్పారు. ఏపీ సర్కారు నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ముక్త కంఠంతో తెలిపారు. అయితే ఒక్క వ్యక్తి మాత్రం ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అమరావతిని మున్సిపాలిటీగా గుర్తించేందుకు నిర్ణయించిన ఏపీ సర్కారు పనికి మద్దతు పలికారు. అమరావతిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు గాను రాజధాని పరిధిలోని లింగాయపాలెంలో తొలి సభ నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు.
ఒక్కరు తప్పా అంతా వ్యతిరేకం
లింగాయపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మొత్తం 79 మంది హాజరు అయ్యారు. ఇందులో ఏకంగా 78 మంది వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం అధికారుల ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. ఉద్ధండ రాయుని పాలెంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గ్రామస్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. ఉద్దండ్రాయునిపాలెం గ్రామ సభలో అధికారులపై అసైన్డ్ రైతులు మండిపడ్డారు. వైసీపి ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడున్నర ఏళ్ల నుండి కౌలు డబ్బులు వెయ్యడం లేదని ఆరోపించారు. సమాన ప్యాకేజీ అని హామీ ఇచ్చీ అదీ ఇవ్వలేదని విమర్శించారు. 2500 పెన్షన్ ను 5 వేలు చేస్తామమని హామీ ఇచ్చి అది కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. టిడ్ కో ఇళ్ళు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. అసైన్డ్ పొలాలు అమ్ముకోలేకుండా ఈ ప్రభుత్వం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముక్తకంఠంతో తిరస్కరణ
రాజధాని అమరావతి పరిధిలోని 19 గ్రామ పంచాయతీలతో నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు ఈ ఏడాది జనవరిలో ప్రయత్నించింది. దీని కోసం అప్పట్లో నిర్వహించిన గ్రామ సభల్లో ప్రజలు ముక్త కంఠంతో తిరస్కరించారు. మొత్తం 29 పంచాయతీలతో నగర పాలక సంస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదిలోనే హంసపాదు
ఇప్పుడు మరో సారి రాజధాని పరిధి తుళ్లూరు మండలంలోని 19 పంచాయతీలు, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలతో కలిపి అమరావతిని పురపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో అమరావతి రాజధాని పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వం నిర్ణయం మేరకు గ్రామ సభలు నిర్వహించి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తొలి గ్రామ సభలు నిర్వహించగా.. గ్రామస్థుల నుండి పూర్తి స్థాయిలో వ్యతిరేకత రావడం గమనార్హం. ప్రభుత్వం నిర్ణయాన్ని ముక్త కంఠంతో తిరస్కరించడం పల్ల అధికారులు సందిగ్దంలో పడ్డారు. స్థానిక నాయకులు స్థితి మరింత ఘోరంగా ఉంది. వైసీపీ ప్రభుత్వ పెద్దలు మాత్రం మున్సిపాలిటీ చేయాలన్న నిర్ణయంపై బలంగా నిలబడగా.. గ్రామస్థులు వ్యతిరేకిస్తుండటంతో ఏం చేయాలన్న స్థితిలో స్థానిక నాయకులు మునిగిపోయారు.