పల్నాడులో మళ్లీ వైసీపీ జెండా ఎగరాలి, టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలి: విజయసాయిరెడ్డి
Vijaysai Reddy: పల్నాడు జిల్లాలో 2024లోనూ వైసీపీ జెండాను ఎగరెయ్యాలని పార్టీ నాయకులకు దక్షిణ కోస్తా జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
Vijaysai Reddy: పల్నాడు జిల్లాలో 2024లోనూ వైసీపీ జెండాను ఎగరెయ్యాలని పార్టీ నాయకులకు దక్షిణ కోస్తా జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వైసీపీ సమీక్ష సమావేశంలో భాగంగా విజయసాయిరెడ్డి ఏడు నియోజకవర్గాల్లోని నాయకులతో విడివిడిగా బుధవారం నరసరావుపేటలో సమావేశం అయ్యారు. ప్రధానంగా ఏడు నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్ధితులు, పార్టీ సంస్ధాగత నిర్మాణం, సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అంశాలపై వారితో ఆయన చర్చించారు.
పల్నాడు జిల్లా వైసీపీ సమీక్ష సమావేశంలో భాగంగా బుధవారం నరసరావుపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావులతో దక్షిణ కోస్తా జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విడివిడిగా సమావేశాలు నిర్వహించారు.
పల్నాడు జిల్లాలో పార్టీ చాలా బలంగా ఉందని, 2019లో ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు, ఎంపీ స్థానాన్ని పార్టీ కైవసం చేసుకుందని, మళ్లీ 2024 కూడా పల్నాడు జిల్లాలో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. ఈ ఏడు నియోజకవర్గాలలో పెద్ద ఏత్తున సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు అవుతున్నాయని సీఎం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. రాజకీయంగా కూడా అన్ని వర్గాలకు ఆయన రాజకీయ పదవులను ఇచ్చారని అన్నారు. అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు సీఎం జగన్ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారని విజయసాయిరెడ్డి అన్నారు.
ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలన్నారు. పార్టీని సంస్ధాగత నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవలేక కుట్రలకు తెరతీస్తోందని, వైసీపీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొడవలు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. కార్యకర్తలు సంయమనం పాటించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా పార్టీ గెలుపు కోసం కృషి చెయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.