(Source: ECI/ABP News/ABP Majha)
TDP Leaders: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో జగన్ లో అసహనం, ఫిర్యాదులు లేకున్నా మార్గదర్శిపై లేనిపోని ఆరోపణలు!
TDP Leaders on CM Jagan: సీఎం జగన్ లో అసంతృప్తి పెరగడం వల్లే.. ఒక్క ఫిర్యాదు కూడా రాని మార్గదర్శి సంస్థపై అనవసరంగా సీఐడీ దర్యాప్తు చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.
TDP Leaders on CM Jagan: ఏపీలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో అసంతృప్తి పెరిగిపోయిందని టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ మూర్తి, ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. విశ్వసనీయత ఉన్న సంస్థలపై కావాలనే కోపం పెట్టుకుని.. పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. రెండు లక్షల మంది వినియోగ దారులు ఉన్న అతిపెద్ద సంస్థ మార్గదర్శి అని బండారు సత్యనారాయణ మూర్తి తెలిపారు. తాను కూడా ఆ సంస్థలో చందాదారుడినే అని వివరించారు.
వినియోగదారుడి నుంచి ఒక్క ఫిర్యాదు లేకపోయినా చేతిలో కీలుబొమ్మలా ఉన్న సీఐడీతో మార్గదర్శిపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు అవినీతి, అరాచకాలను తమకు చెందిన మీడియా సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారనే కోపంతోనే మార్గదర్శిపై సీఎం జగన్ కోపం పెంచుకున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సంస్థపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు. సీఎం జగన్ పుట్టక ముందు నుంచి మార్గదర్శి సంస్థ ఉందని.. దానిపై సీఐడీ దాడిని తీవ్రంగా ఖండించారు బండారు సత్యనారాయణ.
నీకు రోజులు దగ్గర పడ్డాయి జగన్.. ప్రత్తిపాటి మండిపాటు
"85 ఏళ్ల రామోజీరావు ఈ దేశానికి ఒక లెజెండ్. తెలుగు జాతి గర్వించేలా కృషి చేశారు. సీబీఐ, ఈడీ కేసులు పెట్టి 16 నెలలు జైలులో ఉన్న సీఎం జగన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని.. ప్రభుత్వ వైఫల్యాల చూపిస్తున్నారనే ఉద్దేశ్యంతోనే మార్గదర్శి సంస్థలపై దాడులు చేయిస్తున్నారు. మార్గదర్శి సంస్థలపై కస్టమర్ల నుండి ఒక్క ఫిర్యాదు కూడా రాకపోయినా మార్గదర్శి సంస్థల ఎండీ శైలజ గారిని టార్గెట్ చేస్తూ.. జగన్మోహన్ రెడ్డి నీచ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
పేద ప్రజలకు ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని అందించడమే కాకుండా మార్గదర్శి చిట్స్ ద్వారా అందరికీ అండగా నిలుస్తున్న శైలజని టార్గెట్ చేయడం దారుణం. నీకు రోజులు దగ్గర పడ్డాయి జగన్. అలాగే మీ నాన్నగారి హయాంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అడ్డుగా పెట్టుకుని అదే మార్గదర్శి సంస్థలపై దాడులు చేసి ఏమీ చేయలేకపోయారు. రామోజీ రావు, మార్గదర్శి సంస్థల ఎండీ శైలజలను టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.
మార్గదర్శిపై ఫైర్ అయిన మాజీ ఎంపీ ఉండవల్లి
మార్గదర్శి చిట్స్ వ్యాపారంలో అనేక నిబంధనలను ఉల్లంఘించిందని, ఇప్పుడు అవే అక్రమాలు బయట పడుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలే అన్నారు. కొన్ని రోజుల కిందట రాజమండ్రిలో మార్గదర్శి వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి నిబంధనలను ఉల్లంఘించిందనే విషయాన్ని తాను ఏనాడో చెప్పానని నష్టాల్లో నడుస్తోందని కూడా చెప్పానని దానిపై ఆ సంస్థ ద్వారా తప్పులు బయ టకు తీసినందుకు తనపై రామోజీరావు కేసులు పెట్టించారని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీ సీఐడీ విచారణలో అందుకు తగ్గట్లే చిట్ అక్రమాలు జరిగినట్లు ఇప్పుడు తేలుతోందన్నారు.